ఇండియన్ సినిమాలో లేడి ఒరియెంటెడ్ సినిమాలు కొత్త ఏమీకావు. దశాబ్దాల కిందటే అలాంటి సినిమాలు వచ్చాయి. మొదట్లో హీరోయిన్లకూ సినిమాల్లో మంచి ప్రాధాన్యత ఉండే సినిమాలు రావడం జరిగింది. తెలుగులో అయితే చాలా క్లాసిక్స్‌లో హీరోయిన్ల పాత్రలు హీరోలకు ధీటైనవే. ఆయా సినిమాలను చాలాసేపు హీరోయిన్లే లీడ్ చేశారు, ఆ సినిమాల్లో మహిళా పాత్రలు చిరకాలం గుర్తుండిపోతాయి. అనేకమంది హీరోయిన్లు అలా ఒక వెలుగు వెలిగారు. హీరోలకు సమానమైన ఖ్యాతిని సంపాదించుకున్నారు. అలాగే తమకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. ఆ తర్వాతి కాలంలో సదరు నటీమణులే ప్రధాన పాత్రలో నటించగా పలు సినిమాలు వచ్చాయి. అవీ హిట్ అయ్యాయి, క్లాసిక్స్‌గా నిలిచాయి. కాలక్రమంలో లేడీ ఒరియెంటెడ్ సినిమాలు ప్రత్యేకం అయిపోయాయి.
ఎవరైనా హీరోయిన్ స్టార్‌గా ఎదిగితే ఆమెను ప్రధాన పాత్రల్లో పెట్టి సినిమాలు రూపొందించే ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది. టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్ ప్రాధాన్యత చాలా వరకూ తగ్గిపోయింది. స్టార్ హీరో, స్టార్ విలన్, స్టార్ కమేడియన్‌ల హవాలు సాగుతున్నప్పుడు హీరోయిన్ అంటే కేవలం పాటల్లో కనిపించే వ్యక్తి అయ్యాయి. సరిగ్గా పాటకు ముందు ఎలాగోలా తెరమీదకు హీరోయిన్ రావడం, పాట తర్వాత మాయం అయిపోవడం.. ఇదే కట్టుబడిలో బోలెడన్ని తెలుగు సినిమాలు వచ్చాయి.
అలాంటి పరిస్థితుల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అనేవి ప్రత్యేకంగా తీసేవి అయ్యాయి. ఇతర కమర్షియల్ సినిమాల్లో ఎలాగూ హీరోయిన్ అందాలను ప్రదర్శించే బొమ్మే, లేడిఒరియెంటెడ్ సినిమాలు స్టార్ అయిన హీరోయిన్ల మార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు అన్నట్టుగా రావడం జరిగింది. వాటిల్లో కొన్ని సూపర్‌హిట్ అయ్యాయి.
అలా చాలాకాలం పాటు హీరోల స్థాయి ఇమేజ్‌తో సాగిన హీరోయిన్ విజయశాంతి అని తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేడీ అమితాబ్‌గా ఆమె ఒక వెలుగు వెలిగారు. అయితే విజయశాంతి హీరోయినిజాన్ని అతిగా ఎలివేట్ చేయడంతో ఆమెవీ చాలా సినిమాలు ఫ్లాప్ కావడం జరిగింది. రాజకీయాలు అంటూ ఆమె సైడైపోవడంతో అలాంటి సినిమాలకు పూర్తిగా తెరపడింది. విజయశాంతి హవా నడుస్తున్న దశలోనే మరి కొంతమంది హీరోయిన్లు తమే సినిమా మొత్తాన్నీ నడిపించే బాధ్యతను తీసుకున్నారు. అలాంటి వారిలో సుహాసిని, శ్రీదేవి, రేవతి, ఖుష్బూ, రమ్యకృష్ణ, మీనా లాంటివాళ్లు ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. వీరిలో బాగా సక్సెస్ అయినది మాత్రం రమ్యకృష్ణే.
హీరో ఉన్నా.. తనే కొన్ని సినిమాలను లీడ్ చేసింది రమ్యకృష్ణ. స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాకా రమ్యకృష్ణ అలా వివిధ సినిమాలను చేసింది. ఇక మరోవైపు భక్తి ప్రధాన సినిమాల హవా నడించింది. అనేకమంది హీరోయిన్లు అలాంటి సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ప్రత్యేకించి 'అమ్మోరు' తర్వాత చాలామంది హీరోయిన్లు దేవత, భక్తురాళ్ల వేషాల్లో కనిపించారు. అలా అనేక సినిమాలు వచ్చాయి. మరోవైపు సెంటిమెంట్ సినిమాలు. 'అమ్మాయి కాపురం', 'పుట్టింటి పట్టుచీర' తరహా సినిమాలు. వీటిల్లో కూడా అనేకమంది హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలాంటి సినిమాలు కట్టిపడేశాయి. వాటిల్లో హీరో కూడా ఉండేవాడు. అయితే సినిమా ఆసాంతం హీరోయిన్లదే ప్రధానపాత్ర.
ఇక హారర్ సినిమాలు.. ఇవి ఎవరిగ్రీన్. చాలాకాలం నుంచి ఈ ట్రెండ్ ఒకటి కొనసాగుతూనే ఉంది. ఆర్జీవీ దగ్గర నుంచి లారెన్స్ వరకూ అనేకమంది దర్శకులు హారర్, థ్రిల్లర్ జోనర్లలో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సినిమాల్లో హీరోయిన్లు ప్రధాన పాత్ర పోషించడం జరుగుతూ వస్తోంది. ఈ సినిమాలకు మార్కెట్ విషయంలో హీరోయిన్ ఒరియెంటెండ్ అనేందుకన్నా హారర్ సినిమాలపై ఉండే క్రేజ్‌తోనే ఆ సినిమాకు ప్రధానంగా డబ్బులు వచ్చాయి.
ఇప్పుడిప్పుడు పుంజుకుంటున్న ట్రెండ్!
నయనతార, సమంత, తాప్సీ వంటి సౌత్ ప్రధాన తారలు, విద్యాబాలన్, కంగనా రనౌత్ వంటి బాలీవుడ్ తారలతో ఇప్పుడు లేడీ ఒరియెంటెడ్ సినిమాలు పుంజుకుంటుండటం గమనార్హం. సౌత్‌లో అయితే ప్రధానంగా హారర్ సినిమాలే హీరోయిన్ల ప్రధాన పాత్రతో రూపొందుతున్నాయి. వాటికి తాప్సీ, సమంత, నయనతార వంటివాళ్లు ఉపయోగపడుతూ ఉన్నారు. వీరిలో నయనతార మరో అడుగు ముందుకు వేసింది. హారర్ సినిమాలతో మొదలుపెట్టి ఆమె క్రైమ్ థ్రిల్లర్లలో కూడా నటిస్తోంది. ఆపై సోషల్ కాజ్‌తో రూపొందుతున్న సినిమాలతో కూడా నయనతార ఆకట్టుకుంది. విజయశాంతి స్థాయి హిట్‌ను నమోదు చేయలేకపోయకపోయినా 'కర్తవ్యం' టైటిల్‌ను కూడా వాడేసింది నయనతార. హీరోయిన్‌గా గ్లామరస్ పాత్రలు చేస్తూనే నయనతార హీరోయిన్ ఒరియెంటెడ్ సినిమాలతో కూడా బిజీ అయ్యింది.
నయనతార సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ ఎంతోకొంత మార్కెట్ ఉండటం, వాటిని మలయాళంలోనూ విడుదల చేసుకోవచ్చు. ఇవన్నీ ఆమె సినిమాలకు ప్లస్‌పాయింట్. తాప్సీతో అయితే సినిమాలను హిందీలో కూడా విడుదల చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇటీవలి సినిమా 'గేమ్‌ఓవర్'ను మూడు భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. పరిమిత బడ్జెట్ లో రూపొందించిన ఆ సినిమా పాజిటివ్ టాక్ పొందింది. మూడుభాషల డిజిటల్, శాటిలైట్ రైట్సే ఈ సినిమాను సేఫ్ జోన్లోకి తీసుకొచ్చే అవకాశం ఏర్పడింది. బాక్సాఫీస్ వసూళ్లు ఆ సినిమాకు లాభాలుగానే నిలిచే అవకాశం ఉంది.
ఇక సమంత ప్రధాన పాత్రల్లో నటించడం మొదలుపెట్టాకా.. 'మహానటి' ఆమె ఖాతాలోకి రాలేదు. ఇక 'యూటర్న్' కమర్షియల్‌గా హిట్ అనిపించుకోలేకపోయింది. అయితే 'ఓహ్ బేబీ'తో సమంత తనసత్తా చూపించింది. నటిగా మరో మెట్టు పైకి ఎదిగింది. చాలా గ్యాప్ తర్వాత ఇంకోవైపు జ్యోతిక కూడా ఇలాంటి ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. సమంత, జ్యోతిక వంటి వాళ్లు హీరోలను పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. కెరీర్‌తో ప్రయోగాలు చేయడానికి అవకాశం ఏర్పడింది. నయనతార కొంచెం సాహసం చేసి సక్సెస్ అయ్యింది. ఇలా ఈ హీరోయిన్లు అంతా కంఫర్ట్ జోన్లోకి వెళ్లడంతో మరిన్ని ఆసక్తిదాయకమైన సినిమాలు వారు చేసే అవకాశం ఏర్పడుతూ ఉంది.
ప్రేక్షకుల సంగతేమిటి?
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ప్రధానంగా మల్టీప్లెక్స్‌లకే పరిమితం అవుతున్న విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇలాంటి సినిమాలకు ఓ మోస్తరు పట్టణాల్లో కూడా కొంత ఆదరణ కనిపిస్తున్నా.. మరీ పాజిటివ్ టాక్ వస్తే తప్ప వాటివైపు ప్రేక్షకులు చూడటంలేదు. ప్రత్యేకించి స్టూడెంట్స్ మాత్రమే అలాంటి చోట ఈ సినిమాలకు ప్రేక్షకులు అవుతున్నారు. సినిమా బాగుందని టాక్ వచ్చినప్పుడే అలాంటి వర్గాలు థియేటర్ వరకూ వెళ్లేందుకు ఆసక్తిచూపుతూ ఉన్నాయి. లేకపోతే ఇలాంటి సినిమాలకు సరైన ఓపెనింగ్స్ ఉండవు, కలెక్షన్స్ కూడా ఉండటంలేదు.
అయితే ఆయా హీరోయిన్లు వ్యక్తిగతంగా సంపాదించుకున్న అభిమానగణం మాత్రం ఎంతోకొంత ఓపెనింగ్స్‌ను తెచ్చిపెడుతూ ఉంది. అందుకే తామే ప్రధాన పాత్రల్లో నటించే సినిమాల కథలను ఎంచుకోవడం కూడా హీరోయిన్లకు కత్తి మీద సామే. ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం వ్యవహారం తిరగబడుతూ ఉంది.