‘బుర్ర’ రాజకీయ కీర్తనలో ఉంటే.. రిజల్ట్ ఇంతే!

అసలు పని విడిచిపెట్టి, ఎవరైనా అతి చేస్తుంటే గనుక.. ‘బుర్ర రామకీర్తన పాడిస్తానని’ పెద్దలు హెచ్చరిస్తారు! ఎగస్ట్రాలు వద్దు దండిస్తానని ఆ తెలుగుజాతీయానికి అర్థం! అలాగే ‘బుర్ర’ రాజకీయ కీర్తనల్లో నిమగ్నమైపోయి ఉంటే.. ఇక…

అసలు పని విడిచిపెట్టి, ఎవరైనా అతి చేస్తుంటే గనుక.. ‘బుర్ర రామకీర్తన పాడిస్తానని’ పెద్దలు హెచ్చరిస్తారు! ఎగస్ట్రాలు వద్దు దండిస్తానని ఆ తెలుగుజాతీయానికి అర్థం! అలాగే ‘బుర్ర’ రాజకీయ కీర్తనల్లో నిమగ్నమైపోయి ఉంటే.. ఇక అసలు పని మీద ధ్యాస ఎలా కుదురుతుంది? ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా అచ్చంగా ఇదే వ్యవహారం జరుగుతోంది.

పదునైన సంభాషణల రచయితగా ఇదివరకు గుర్తింపు ఉన్న ‘బుర్రా’ సాయిమాధవ్.. ఇప్పుడు తనకున్న గుర్తింపుకు తానే మచ్చ తెచ్చుకుంటున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన రామ్ చిత్రం ది వారియర్ విడుదల ఆ విషయాన్ని మరోమారు నిరూపించింది. ఒక్కటంటే ఒక్కటైనా పదునైన డైలాగు లేకపోవడం.. బుర్రా సాయిమాధవ్ ప్రతిభా సామర్థ్యాలు అథోగమనంలో ఉన్నాయనడానికి నిదర్శనమా? లేదా, రాజకీయాభిలాషతో ఆయన బుర్రంతా నిండిపోయి తన మౌలికమైన బతుకుతెరువు బాధ్యతకు సమయం కేటాయించలేకపోతున్నారా? అని టాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు.

‘నేల విడిచి సాము చేయరాదనే’ సామెత మనకు చాలా నీతిని నేర్పుతుంది. మనం నిర్వహించే మౌలిక బాధ్యతల పట్ల ఒక కమిట్మెంట్‌తో పనిచేయాలి. దానిని విస్మరించకుండా ఎన్ని అదనపు బాధ్యతలను నెత్తికెత్తుకున్నా కూడా నడుస్తుంది. అందుకే చదువుల్లో కూడా కరికులమ్ అనేది చదువులకు సంబంధించినది అయితే.. ఎక్స్‌ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి ఆటపాటలకు సంబంధించినది అయి ఉంటుంది. అసలుది పట్టించుకోకుండా రెండోది చేయడం కరెక్టు కాదు అని మనకు అర్థమవుతుంది. 

బుర్రా సాయిమాధవ్ మంచి సంభాషణల రచయిత. కాకపోతే ఇటీవలి కాలంలో ఆయనకు రాజకీయ అనురక్తి ఎక్కువైంది. బాలకృష్ణతో సాన్నిహిత్యమూ పెరిగింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో పీతాంబరంగా.. రామారావు పట్ల ఒక అపరిమితమైన ఆరాధను ప్రదర్శించిన బుర్రా సాయిమాధవ్.. ఇంకా ఆ కేరక్టర్ లోనే ఉండిపోయారా? కేరక్టర్ లోంచి బయటకు రాలేదా? అనే సందేహం కలుగుతుంది.

ఆయన ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీతో అతిగా రాసుకుపూసుకు తిరుగుతున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రధానంగా పెన్ పవర్ ఉన్న రచయితలు.. రాజకీయ పార్టీలతో బంధం పెంచుకుని.. వారికోసం పనిచేయడం కొత్త సంగతి కాదు. అది కేవలం వారి రాజకీయ ప్రేమ, లేదా, డబ్బు కోసం చేసే పని మాత్రమే అయి ఉండేది. 

కానీ బుర్రా సాయిమాధవ్ రెండాకులు ఎక్కువ చదివినట్లుగా.. టీడీపీ పార్టీ మీటింగులకు కూడా క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఆయన ఇలా రాజకీయ సాముగరిడీలు ఎన్ని చేసినా పరవాలేదు గానీ.. ఆ సాములు నేలవిడిచి, అనగా, తన అసలు పని అయిన సంభాషణల రచయిత బాధ్యతలను సీరియస్ గా తీసుకోకుండా, చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సినిమా సంభాషణలకు ప్రస్తుత రచయితలో భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న వారిలో బుర్రా సాయిమాధవ్ అగ్రశ్రేణిలో ఉన్నారు. కానీ ఆయన తాజా చిత్రం ‘ది వారియర్’లో బుర్రా మార్కు డైలాగు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. యాంగ్రీ పోలీసాఫీసర్ పాత్ర అనగానే.. మనం డైలాగుల పరంగా చాలా పంచ్‌లు, చమక్కులు ఆశిస్తాం. కానీ.. అవేమీ లేకుండా పేలవమైన సంభాషణలతో.. ఇవి రాసింది బుర్రానేనా? అని ప్రతిప్రేక్షకుడూ సందేహించేలా ఈ చిత్రం సాగిపోతుంరది. ఆయన రాజకీయ వ్యాపకాలే.. సినిమా కెరీర్ ను మింగుతున్నాయా? అనే సందేహమూ కలుగుతుంది!

కేవలం సంభాషణలు మాత్రమే కాదు. సంగీతం కూడా అంతే. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన పాటలు.. అంతగా రక్తికట్టలేదు. 

టాప్ గ్రేడ్ కు చెందిన ఇద్దరు టెక్నీషియన్లు.. లింగుస్వామి అనే దర్శకుడికి ఇచ్చిన అవుట్‌పుట్ ఈ సినిమాకు మైనస్. అలాగని వీరు ప్రతిభ పరంగా తక్కువ వారేమీ కాదు. వీరినుంచి పనిని రాబట్టుకోగల దర్శకులకు మాత్రమే.. మనసుపెట్టి పనిచేస్తూ, తతిమ్మా వారికి నామ్ కే వాస్తే గా అవుట్ పుట్ ఇచ్చేస్తున్నారా? అనే సందేహమూ కలుగుతోంది. దర్శకులను బట్టి మాత్రమే వీరి ప్రతిభ రాణిస్తుందా? అది వారిలో సహజాతమైనది కాదా? అనే అభిప్రాయమూ ఏర్పడుతుంది.

అయినా.. రాజకీయ ఆసక్తి ఉండడం తప్పు కాదు.. కానీ ఆ మాయలో పడి అసలు పనిని విస్మరిస్తే కెరీర్ దెబ్బతినిపోతుందని.. బుర్రా సాయిమాధవ్ లాంటివాళ్లు తెలుసుకోవాలి.