Advertisement

Advertisement


Home > Movies - Movie News

కాస్టింగ్ కౌచ్ వలలో మరో పెద్ద చేప

కాస్టింగ్ కౌచ్ వలలో మరో పెద్ద చేప

కొన్నాళ్ల కిందట బాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది కాస్టింగ్ కౌచ్ వ్యవహారం. నానా పటేకర్ లాంటి పెద్ద మనిషిని ఈ ఊబిలోకి లాగింది తనుశ్రీ దత్తా. ఆ తర్వాత ఈ దుమారం సౌత్ లో కూడా చెలరేగింది. కొన్ని రోజులుగా స్తబ్జుగా ఉన్న ఈ దుమారం, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈసారి స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

గణేశ్ ఆచార్య తనను లైంగికంగా వేధించాడంటూ 33 ఏళ్ల మహిళ, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ముంబయిలోని అంధేరిలో ఉన్న అతడి ఆఫీస్ కు ఎప్పుడు వెళ్లినా, నీలిచిత్రాలు చూడమని తనను వేధించేవాడని ఆరోపించింది. తను నిరాకరిస్తే భౌతికంగా దాడిచేయడంతో పాటు తన సిబ్బందితో పాటు కొట్టించాడని తన ఫిర్యాదులో పేర్కొంది సదరు మహిళ.

నిజానికి గతంలోనే గణేష్ ఆచార్య బుక్ అవ్వాల్సిందే. కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గతంలోనే అతడిపై సంచలన ఆరోపణలు చేశారు. తోటి డాన్సర్లతో గణేష్ ఆచార్య అసభ్యంగా ప్రవర్తించేవాడని, సినీడాన్సర్స్ అసోసియేషన్ లో తనకున్న పలుకబడిని దుర్వినియోగం చేశాడని ఆరోపించింది. అయితే అప్పట్లో ఇతర దుమారాల కారణంగా గణేష్ ఆచార్యపై ఫోకస్ తగ్గింది. ఈసారి మాత్రం ఇతడు బాగానే తెరపైకొచ్చాడు.

ఏకంగా జాతీయ మహిళా కమిషన్ ఈ విషయంపై దృష్టిపెట్టబోతోంది. తన ఫిర్యాదులో సదరు మహిళ, గణేష్ ఆచార్యపై చాలా ఆరోపణలు చేసింది. రోజూ గణేష్ ఆచార్య ఆఫీస్ లో పోర్న్ వీడియోలు చూస్తూనే ఉంటాడని చెప్పింది. తనకు వచ్చే రెమ్యూనరేషన్ లో కమీషన్ అడిగేవాడని, ఇవ్వడానికి నిరాకరిస్తే కలిసి పోర్న్ వీడియోలు చూడాలని బలవంతం చేసేవాడని ఆమె ఆరోపించింది.

తాజా ఆరోపణలపై గణేష్ ఆచార్య స్పందించాడు. కేవలం తన పరపతిని దెబ్బతీసేందుకే ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించాడు. డాన్స్ కో-ఆర్డినేటర్స్ వ్యవస్థకు వ్యతిరేకంగా తను పోరాటం చేస్తున్నానని, దీన్ని సహించలేని కొందరు తనపై ఇలాంటి పసలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. పోరాటం చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిగ్గా టార్గెట్ అయ్యానని, ఇలాంటి ఆరోపణలకు భయపడి తన పోరాటాన్ని ఆపనని అంటున్నాడు.

తనపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన మహిళపై పరువు నష్టం దావా వేస్తానంటున్నాడు గణేష్ ఆచార్య. తనకు తగిన గుణపాఠం చెబుతానంటున్నాడు. అయితే గణేష్ ఎన్ని చెప్పినా ఆయన మహిళా కమిషన్ విచారణకు హాజరుకాక తప్పదు. సదరు మహిళ సమర్పించిన సాక్ష్యాలపై సంజాయితీ ఇవ్వక తప్పదు.

నేను అనుకున్నదానికంటే బాగా చేశాడు మా అబ్బాయి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?