మెగాబ్రదర్స్‌లో నాగబాబు సరదా మనిషి. జీవితాన్ని యుద్ధంలా కాకుండా, ఆహ్లాదంగా గడపాలనేది ఆయన ఆకాంక్ష. తానొక్కడే కాదు, సమాజం అట్లే ఆలోచిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయాలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా వివిధ అంశాలపై తనవైన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో నాగబాబు పేరు సంపాదించారు.
ఇటీవల నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగబాబు రెండో పెళ్లిపై సరదాగా ఆసక్తి కనబరచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరేమో నాగబాబును ట్రోల్ చేయగా, మరికొందరేమో ఫన్నీ ఓపీనియన్‌గా ఎంజాయ్ చేశారు. తాజాగా మరోసారి రెండో పెళ్లిపై నాగబాబును ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
ఇటీవలి తన కామెంట్‌పై సోషల్ మీడియాలో సాగిన చర్చను దృష్టిలో పెట్టుకుని… ఈ దఫా ఆయన జాగ్రత్తగా స్పందించారు.
ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్ చాట్‌లో ‘మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్’ అని నెటిజన్ నేరుగా ప్రశ్నించాడు. దీనికి నాగబాబు స్పందిస్తూ … ‘మా ఆవిడ అంగీకరించలేదు. ఆ ఆలోచన వచ్చినా పీక కోస్తా అని ప్రేమగా చెప్పింది.
అంత ప్రేమగా చెప్పిన తర్వాత కూడా నేను రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తా’ అంటూ తన మార్క్ ఆన్సర్ ఇచ్చారాయన. దీంతో మరోసారి నాగబాబు అభిప్రాయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.