మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు, నిహారిక భర్త అయిన జొన్నలగడ్డ చైతన్య ఓ విషయమై బాధపడ్డారు. ఈ సంగతిని తానే చెప్పారు. షేక్‌పేట్‌లోని అపార్ట్మెంట్ వాసులతో వివాదం కాస్త బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే.
చైతన్య అర్ధరాత్రిపూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని, వారు మద్యం తాగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నట్టు అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో వివాదంపై చైతన్య స్పష్టత ఇచ్చారు. అపార్ట్‌మెంట్‌వాసులు గొడవ చేయడం వల్లే తానే ఫిర్యాదు చేశానన్నారు. అయితే ముందుగా తన మీదే కేసు నమోదైనట్టే వార్తలు రావడం తనను బాధించిందని చైతన్య చెప్పుకొచ్చారు. అందరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకున్నట్టు ఆయన చెప్పారు. ఆగస్టు 10లోగా ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు ముందే ఓనర్‌కి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
ఫ్లాట్ తీసుకున్నప్పుడే ఆఫీస్ పర్పస్ కోసమని ఓనర్‌కి చెప్పామన్నారు. కానీ అపార్ట్మెంట్ అసోసియయేషన్‌కు ఆ విషయమై సమాచారం లేకపోవడంతో వాదనకు దిగారన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్‌ను నిహారిక దంపతులు కమర్షియల్‌గా వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు.
ఆఫీస్ కోసమని ఫ్లాట్ తీసుకున్న విషయం తమకు తెలియదన్నారు. ఇప్పుడు అందరం కలిసి సమస్యను పరిష్కరించుకున్నామని వివరించారు.