ఎలాంటి కాంబినేషన్ అది. ఫిదా తరువాత సాయిపల్లవి-శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా. ఎన్నాళ్లుగానో అనుకుంటున్న చైతూ-సాయిపల్లవిల కాంబినేషన్. అది కూడా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో.
ఇలాంటి సినిమా ఎలా రావాలి? బోరవిడుచుకుని రావాలి. బస్తీ మే సవాల్..ఏ సినిమా వస్తుందో రమ్మనండి చూసుకుందాం. అన్నట్లు వుండాలి. కానీ అలాంటిది నాని హీరోగా టక్ జగదీష్ అనే సినిమా, అది కూడా ఓటిటిలో విడుదలవుతుంటే అంత కిందా మీదా అయిపోతోంది ఏమిటి?
అంటే టక్ జగదీష్ ముందు లవ్ స్టోరీ ఆగలేదేమో అని జంకుతోందా? సరే ఓటిటిలో విడుదల సంగతి అలా వుంచుదాం. గిల్డ్ పద్దతుల ప్రకారం ఒకే రోజు రెండు సినిమాలు విడుదలయినా ఫరవాలేదు. సపోజ్..ఫర్ సపోజ్ టక్ జగదీష్ కనుక లవ్ స్టోరీతో సమానంగా అదే రోజు థియేటర్లలో విడుదలయితే, అప్పుడేం అంటారు? అప్పుడు కూడా టాఠ్..వీల్లేదు అంటూ యాగీ చేస్తారా?
ఓటిటిలో లవ్ స్టోరీ మీద టక్ జగదీష్ సినిమా వేయకూడదు అని యాగీ చేస్తున్నవారంతా ఓ విధంగా శేఖర్ కమ్ముల, నాగ్ చైతన్య సమర్థతకు గండి కొడుతున్నారు. వాళ్ల స్టామినాను తక్కువ చేస్తున్నారు. లవ్ స్టోరీ సినిమా కెపాసిటీ మీద అనుమానాలు పెంచుతున్నారు.
వారం అటు వారం ఇటు ఏ సినిమా ఉండకూడదు, ఓటిటిల్లో సినిమా వేయకూడదు, టీవీల్లో ఏవో అడుగు బొడుగు సినిమాలు వేసుకోవాలి. అప్పుడే లవ్ స్టోరీ సినిమాకు న్యాయం చేసినట్లు, అన్యాయం చేయనట్లు అని అనడం చూస్తుంటే అంత మంచి కాంబినేషన్ ను కచ్చితంగా తక్కువ అంచనా వేసినట్లే.