చూంద్ర బప్పా నాయుడు.. పమ్మినేని రాంరాం

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న కాంట్రవర్షియల్ మూవీ కమ్మరాజ్యంలో కడపరెడ్లు.. ట్రైలర్ కంటే అందులో నటీనటుల పాత్రలకు పెట్టినపేర్లు మరింత కాంట్రవర్షీ క్రియేట్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. శాంపిల్ గా వర్మ రిలీజ్ చేస్తున్న…

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న కాంట్రవర్షియల్ మూవీ కమ్మరాజ్యంలో కడపరెడ్లు.. ట్రైలర్ కంటే అందులో నటీనటుల పాత్రలకు పెట్టినపేర్లు మరింత కాంట్రవర్షీ క్రియేట్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. శాంపిల్ గా వర్మ రిలీజ్ చేస్తున్న స్టిల్స్, పాత్రల పేర్లు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు పేరుని చూంద్ర బప్పా నాయుడిగా మార్చి సీబీఎన్ అనే అబ్రివేషన్ ని అలాగే కంటిన్యూ చేశాడు వర్మ. లోకేష్, పవన్ కల్యాణ్ పాత్రలకి ఇంకెలాంటి పేర్లు పెట్టి ఉంటారోననే ఆసక్తి అందరిలోనూ పెరిగేలా చేశారు.

గతంలో రక్తచరిత్ర సినిమాకి కూడా క్యారెక్టర్ పేర్లతో సమస్య వచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి స్టైలే ఫాలో అయ్యాడు వర్మ. తాజాగా మరింత వెటకారంగా చూంద్రబప్పా నాయుడు అంటూ చంద్రబాబు పేరు మార్చేసి టీడీపీ అభిమానుల్ని ఓ రేంజ్ లో గెలికాడు. కేవలం టీడీపీని టార్గెట్ చేస్తే తన సినిమాకి క్రేజ్ రాదనుకున్నాడో ఏమో.. విడుదల సమయానికి అన్ని పార్టీలకూ సెగపెడుతున్నాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పాత్రను హైలెట్ చేస్తూ మంచి కామెడీ పండిస్తున్నాడు, కామెడీ పీస్ లోకేష్ ఎలాగూ ఉన్నారు. మిగిలింది వైసీపీ.

నేరుగా జగన్ పై సెటైర్లు వేసే ధైర్యం చేశాడో లేదో కానీ, వైసీపీ నేతల్ని మాత్రం టార్గెట్ చేస్తున్నాడు వర్మ. పమ్మినేని రాంరాం అంటూ స్పీకర్ పాత్రలో అలీ నిద్రపోయే స్టిల్ ఒకటి తాజాగా విడుదల చేశాడు. అంటే.. వైసీపీ బ్యాచ్ ని కూడా వర్మ వదల్లేదన్నమాట. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టార్గెట్ చంద్రబాబే అయినా.. రాష్ట్రంలోని అన్ని పార్టీలను ఉతికి ఆరేయబోతున్నాడని అర్థమవుతోంది. ఇక సినిమా ట్రైలర్ తో తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాడు వర్మ.

కేసుల వరకూ పరిస్థితి వెళ్లిందంటే అది వర్మ సాధించిన విజయమేనని చెప్పాలి. సినిమా టైటిల్, కథపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకరు కేసు పెట్టారు. అనంతపురం ఉదాహరణగా.. ఇతర జిల్లాల్లో కూడా కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తమ్మీద రిలీజ్ టైమ్ కి వర్మ అనుకున్నదాని కంటే ఎక్కువగానే మైలేజీ సాధించాడు.