ప్రముఖ గాయకుడు మనోపై డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, గాయనిగా తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చిన్మయి శ్రీపాద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ గాయకుడు కార్తిక్‌కు ఆయన అండగా నిలిచి ఆమెతో తిట్లు తినాల్సి వచ్చింది.
ఇటీవల చిన్మయి శ్రీపాద `మీటూ` ఆరోపణలతో సంచలనం రేకెత్తిస్తోంది. తమిళ ప్రముఖ రచయిత వైరముత్తపై ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగానే ప్రముఖ గాయకుడు కార్తిక్‌పై కూడా చిన్మయి అలాంటి ఆరోపణలే చేసి మరోసారి సంచలనం సృష్టించింది. కార్తిక్‌కు ప్రముఖ గాయకుడు మనో మద్దతుగా నిలిచాడు.
అంతేకాదు, అతను మరో అడుగు ముందుకేసి చిన్మయితో మాటలు పడాల్సి వచ్చింది. కార్తిక్‌కు మద్దతుగా నిలిచిన మనోపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా చిందులు తొక్కింది. `కార్తిక్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన అమ్మాయిలను తీసుకుని తన ఇంటికి తీసుకురమ్మని మనోగారి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. మనోగారి నుంచి వచ్చిన కాల్…మాకు న్యాయం చేసేదిలా ఉంటుందని ఆశించాం. కార్తిక్ భార్య గర్భవతి అని, ఆయన కెరీర్‌ను నువ్వు ఎందుకు నాశనం చేయాలని అనుకుంటున్నావ్. మీరిద్దరూ ఎంతో కష్టపడి పైకి వచ్చారు. దీన్ని ఇంతటితో వదిలెయ్యండి అని మనో గారు రాజీ కుదిర్చే యత్నం చేశాడు` అని ఆమె సోషల్ మీడియా ద్వారా చెప్పారు.
మనో తనకు చెప్పిన అంశాలపై చిన్మయి తీవ్రస్థాయిలో స్పందించారు.
`మనోగారు చెప్పింది నిజమే. కష్టపడి పైకి వచ్చిన గాయకుడిగా కార్తిక్ అంటే నాకు గౌరవం ఉంది. కానీ వేరొకరిని లైంగికంగా వేధించొచ్చా? గొప్ప ప్రతిభావంతులు కావొచ్చు. కానీ, గొప్ప మనుషులు మాత్రం కాదు. డబ్బు, అధికారం ఉన్నంతమాత్రాన వేరొకరిని వేధించడాన్ని మనం అనుమతించాలా? గత ఏడాదిన్నర కాలంలో నేను చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. ఎవరిని గౌరవించాలో తెలుసుకున్నా` అని చిన్మయి ఓ లేఖను పోస్ట్ చేసింది.
అనవసరమైన విషయాల్లో మనో తలదూర్చి చిన్మయితో హితబోధ చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. లైంగిక వేధింపులకు మద్దతుగా నిలిచారన్న అపకీర్తిని మనో మూటకట్టుకోవాల్సి వచ్చింది.