చిన్న నిర్మాతలు తొందరపడుతున్నారు. ఏదో ఒక ప్రాజెక్ట్ చేసేయాలనే ఉత్సాహంతో అనవసరంగా బడ్జెట్ పెంచుకుంటున్నారు. ఏదో కథ దొరుకుతుంది. అది కాస్త బాగానే వుంటుంది. కానీ మిడ్ రేంజ్ హీరోలు దొరకరు. దాంతో దొరికిన హీరోతో చేసేద్దాం అని తొందరపడతారు. పైగా ఆ రేంజ్ నిర్మాతలకు మిడ్ రేంజ్ హీరోలు అంత త్వరగా ఊ అనరు.
ఒక వేళ నిర్మాతకు రేంజ్ వున్నా, కథకు లేకపోయినా సమస్యే. ఇలాంటపుడు చిన్న హీరోలు లైన్ లోకి వస్తారు. కానీ వాళ్లు కూడా కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఏడెనిది కోట్లలో పూర్తి కావాల్సిన సినిమా పది నుంచి పదిహేను కోట్లకు డేకేస్తోంది.
త్వరలో విడుదలవుతున్న ఓ చిన్న సినిమా వుంది. నిజానికి ఏడెనిమిది కోట్ల నుంచి పది కోట్ల లోపు బడ్జెట్ తో పూర్తి కావాల్సిన సినిమా. కానీ హీరోనే రెండు కోట్లకు పైగా తీసుకున్నారు. పైగా రెండు పాటలు ఫారిన్ లో తీయాలి అనే కోరిక మరొకటి. దాంతో బడ్జెట్ కాస్తా నాన్ థియేటర్ ను దాటేసింది. థియేటర్ బర్డెన్ తప్పడం లేదు. ఈ హీరోకి అస్సలు ఒక్క టికెట్ తెగగొట్టే పుల్లింగ్ లేదు. ఇప్పుడు దాదాపు థియేటర్ మీద నాలుగు కోట్ల వరకు బర్డెన్ వుంది.
వరుస ఫ్లాపులు చవిచూస్తున్న హీరో సినిమా ఒకటి రాబోతోంది. ఈ సినిమాకు దాదాపు 15 నుంచి 17 కోట్లు ఖర్చయిపోయింది. నాన్ థియేటర్ ఎంత వస్తుంది ఆ హీరోకి, మహా అయితే పది నుంచి పన్నెండు కోట్లు. మిగిలినదంతా థియేటర్ మీద బర్డెన్ నే. సదరు హీరోకు థియేటర్ మీద నుంచి అయిదారు కోట్లు వస్తుందనే నమ్మకం లేదు. అయినా చేసేందేం లేదు. విడుదల చేసుకోవాల్సిందే. ఈ సినిమాకు ఈ హీరోకి నాలుగు కోట్ల రెమ్యూనిరేషన్ ఇచ్చారని తెలిసి ఇండస్ట్రీ జనం అవాక్కవుతున్నారు.
ఇటీవల ఓ చిన్న సినిమా విడుదలయింది. కొత్త నిర్మాత కావడంతో అనుభవం లేదు. అనేక సమస్యలు. మూడు నాలుగేళ్లు పట్టింది సినిమా నిర్మాణానికే. దర్శకుడు ఆడేసుకున్నాడు. అయిదుకోట్లు పోయింది. ఫ్లాప్ తీసారన్న పేరు మిగిలింది. అదే డబ్బులు రియల్ ఎస్టేట్ మీద పెట్టి వుంటే అయిదు పోకుండా వుండడంతో పాటు మరో అయిదు వచ్చి వుండేవి అని నిట్టూరుస్తున్నారు ఇప్పుడు.
ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే మరీ అద్భుతమైన టాక్ వస్తే తప్ప చిన్న సినిమా థియేటర్ లో నిల్చునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది చివరకు చిన్న హీరోల విషయంలో ఇండస్ట్రీకి ఓ క్లారిటీ వచ్చేస్తుంది.