వెల్ డ‌న్: క‌మేడియ‌న్ కొడుకు.. సివిల్స్ ర్యాంక‌ర్

సినీ రంగంలో స్టార్లుగా ఎదిగిన క‌మేడియ‌న్ల కొడుకులు హీరోలుగా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఆ ప్ర‌య‌త్నాల్లో అటు విజ‌య‌వంతం కాలేక పోయినా, తండ్రులు గ‌ట్టిగా సంపాదించి ఉండ‌టంతో అలా సెటిల‌యిపోతుంటారు. ఇక ఇండ‌స్ట్రీలో అంతంత మాత్రంగా…

సినీ రంగంలో స్టార్లుగా ఎదిగిన క‌మేడియ‌న్ల కొడుకులు హీరోలుగా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఆ ప్ర‌య‌త్నాల్లో అటు విజ‌య‌వంతం కాలేక పోయినా, తండ్రులు గ‌ట్టిగా సంపాదించి ఉండ‌టంతో అలా సెటిల‌యిపోతుంటారు. ఇక ఇండ‌స్ట్రీలో అంతంత మాత్రంగా రాణించిన క‌మేడియ‌న్ల పిల్ల‌ల‌ది కాస్త ఇబ్బందిక‌ర‌మైన పరిస్థితి. తండ్రుల‌కు ఎంతో కొంత పేరుంటుంది.

ఆ పేరుతో అటు సినీ రంగంలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. స‌క్సెస్ కు ఫెయిల్యూర్ కు మ‌ధ్య ప‌రిస్థితి ఆ క‌మేడియ‌న్ల‌ది, వారి పిల్ల‌లు అటు సినిమాల పై మోజుతో, ఇటు చ‌దువుకు దూర‌మైన ప‌రిస్థితుల్లో క‌నిపిస్తుంటారు. సినీ రంగంలో అంతంత‌మాత్రం స‌క్సెస్ ను చూసిన కొంద‌రు సినీ న‌టులు మాత్రం త‌మ పిల్ల‌ల‌ను చ‌దివించుకుని, వాళ్ల‌ను సినిమాల వైపు తీసుకురాకుండా ఉద్యోగాల వైపు పంపిస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలో త‌మిళ క‌మేడియ‌న్ చిన్ని జ‌యంత్ త‌న‌యుడు సివిల్స్ ర్యాంక‌ర్ గా నిలిచి, స్టార్ల‌ను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

క‌మ‌ల్ హాస‌న్, ర‌జనీకాంత్ అనువాద సినిమాల‌తో చిన్ని జ‌యంత్ తెలుగు వారికి కొంచెం ప‌రిచ‌యం ఉంటుంది. 90ల‌లో వ‌చ్చిన త‌మిళ అనువాద సినిమాల్లో ఈ న‌టుడు క‌నిపిస్తాడు. ఇప్పుడు అత‌డి త‌న‌యుడు టాక్ ఆఫ్ ద కోలివుడ్ అయ్యాడు. సివిల్స్ లో నేష‌న‌ల్ లెవ‌ల్లో 75వ ర్యాంకు సాధించాడు ఈ హాస్య‌న‌టుడి త‌న‌యుడు. ఇలా ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన ఆ కుర్రాడిని త‌మిళ స్టార్ హీరోలు ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాసన్ లు అభినందించారు.

సాధార‌ణంగా త‌మతో ప‌ని చేసిన హాస్య న‌టుల పిల్ల‌లు ఇండ‌స్ట్రీలోకి వ‌స్తుంటే వారికి అభినంద‌న‌లు తెలుపుతూ ఉంటారు స్టార్ హీరోలు. అయితే చిన్ని జ‌యంత్ త‌న‌యుడు మాత్రం తండ్రికి పూర్తి భిన్న‌మైన రంగంలో రాణించి అంద‌రి మ‌న్న‌న‌లూ పొందుతున్నాడు.

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం