మొదటి సోమవారం ముగిసింది. భోళాశంకర్ ఫలితం పూర్తిస్థాయిలో తేలిపోయింది. ఈ సినిమా ఇక కోలుకోవడం ఎంత మాత్రం సాధ్యం కాదనే విషయం రుజువైంది. మండే టెస్ట్ లో భోళాశంకర్ కంటే జైలర్ సినిమా పైచేయి సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాపై రెండు రకాల పోస్టుమార్టమ్స్ నడుస్తున్నాయి.
చిరంజీవి కామెంట్స్ ప్రకారం..
సరిగ్గా రిలీజ్ కు కొన్ని రోజుల ముందు, ఆంధ్రప్రదేశ్ సర్కారుపై, కొంతమంది మంత్రులపై పరోక్షంగా కామెంట్స్ చేశారు చిరంజీవి. ప్రత్యేక హోదా, సంక్షేమ పథకాలు, ఉపాధి హామీ లాంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాలని, తమపై పడి ఏడుస్తే ఏమొస్తుందంటూ పరోక్షంగా పొలిటికల్ కామెంట్స్ చేశారు.
ఈ ప్రభావం భోళాశంకర్ పై గట్టిగా పడిందంటున్నారు కొన్ని పార్టీల కార్యకర్తలు. చిరంజీవి సినిమాలపై దృష్టి పెడితే మంచిదని, సరిగ్గా ఎన్నికల వేళ ఇలాంటి రాజకీయ ప్రకటనలు చేయడం వల్లనే ఆయన సినిమాకు భారీగా డ్యామేజీ జరిగిందని కొందరు అంటున్నారు. ఓ వర్గం ఈ సినిమాను పూర్తిగా పక్కనపెట్టిందని, నెగెటివ్ ప్రచారం చేసిందనే విమర్శలు వినిపించడానికి ఇదే కారణం.
మెహర్ రమేష్ టేకింగ్..
అయితే మరికొంతమంది మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. సినిమా బాగుంటే, పొలిటికల్ విమర్శలు ఏమాత్రం ప్రభావం చూపించవనేది వీళ్ల వాదన. నిజంగా కంటెంట్ లో దమ్ముంటే, రాజకీయాలతో సంబంధం లేకుండా కామన్ ఆడియన్స్ సినిమాను హిట్ చేస్తారని, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల ముందు క్యూ కడతారని అంటున్నారు.
భోళా బోల్తాకొట్టడానికి ప్రధాన కారణం మెహర్ రమేష్ టేకింగ్ అనేది వీళ్ల వాదన. పాత చింతకాయ పచ్చడి లాంటి కథను తీసుకొని, దాన్ని మరింత కిచిడీగా మెహర్ మార్చేశాడని అఁటున్నారు వీళ్లు. పైగా చిరంజీవి లాంటి సీనియర్ నుంచి, 'మహానటి' లాంటి కీర్తిసురేష్ నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడని వీళ్లు కారణాలు చూపిస్తున్నారు.
కారణాలు ఏమైనా.. ఓ ఫ్లాప్ సినిమాకు ఇలా రెండు రకాలుగా వాదనలు రావడం విశేషం. ఈ రాజకీయాలతో సంబంధం లేని జనం మాత్రం ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు కథ-కథనం లేకపోవడం వల్లనే సినిమా ఫ్లాప్ అయిందని తేల్చేశారు. అటు మెహర్ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.