సాహో వచ్చింది. రిలీజ్ కు ముందువరకు బాహుబలితో ఆ సినిమాను పోల్చారు. బాహుబలి రికార్డుల్ని క్రాస్ చేస్తుందా చేయదా అంటూ ఒకటే చర్చ. కట్ చేస్తే, ఇప్పుడు సైరా వస్తోంది. దీన్ని కూడా బాహుబలితో పోలుస్తూ కథనాలు, విశ్లేషణలు వస్తున్నాయి. అలాంటి అంచనాల్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి. దయచేసి తన సినిమాను బాహుబలితో పోల్చవద్దని పరోక్షంగా విజ్ఞప్తి చేస్తున్నారు చిరు.
సైరా సినిమాతో తనకు గౌరవం మాత్రం దక్కితే చాలంటున్నారు చిరంజీవి. ఓ శంకరాభరణం, ఓ బాహుబలి సినిమాలా తన సైరా సినిమా కూడా టాలీవుడ్ కు గౌరవం తీసుకొస్తే అదే చాలంటున్నారు. కేవలం బాహుబలి విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే సైరా తీశామని, లేకపోతే సైరా సినిమా వచ్చేది కాదని ఒప్పుకున్నారు చిరు.
“చాలా తక్కువ సినిమాలు ఇండస్ట్రీకి గౌరవం తీసుకొచ్చాయి. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిశ్రమకు అలాంటి గౌరవం తీసుకొచ్చిన సినిమా శంకరాభరణం. నేను ఎక్కడికి వెళ్లినా అంతా శంకరాభరణం తీసిన ఇండస్ట్రీ అని చెప్పుకునేవాళ్లు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో గౌరవం తీసుకొచ్చిన సినిమా బాహుబలి. మనందరం కాలర్ ఎగరేసి చెప్పుకునేంత గౌరవం తీసుకొచ్చింది. సైరా సినిమా కూడా అంత గౌరవాన్ని తీసుకొస్తుందనే నమ్మకం నాకుంది. నేను మాట్లాడుతున్నది గౌరవం గురించే. విజయాల గురించికాదు. మరో సినిమాతో పోల్చడం లేదు. ఈ విషయాన్ని అంతా గమనించాలి.”
ఇలా సైరా సినిమాపై పెరుగుతున్న అంచనాల్ని తగ్గించే ప్రయత్నం చేశారు చిరంజీవి. కేవలం చరిత్రలో కనుమరుగైపోయిన ఓ వ్యక్తిని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే సైరాను తీశామని, పైగా అతడు మన తెలుగువాడు కావడంతో సైరా చేయాలని అనుకున్నానని తెలిపారు చిరంజీవి. అంతేతప్ప రికార్డుల కోసం సైరా సినిమా చేయలేదని స్పష్టంచేశారు.
“దాదాపు పుష్కరకాలంగా నా మనసులో మెదులుతున్న సినిమా ఇది. స్వతంత్ర్య సమరయోధుని పాత్ర చేయాలని ఉందంటూ 20 ఏళ్లుగా చెప్పుకుంటూ వచ్చేవాడ్ని. కానీ భగత్ సింగ్ పాత్ర చేసే అవకాశం నాకు రాలేదు. కానీ ఆ తర్వాత 12 ఏళ్ల కిందట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర నా వద్దకు వచ్చింది. మనకు మంగల్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించి తెలుసు. కానీ అదే టైమ్ లో వచ్చిన నరసింహారెడ్డి గురించి తెలియదు. అందుకే మేం తెలియజెప్పాలనుకున్నాం. సైరా చేశాం.”
సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన చిరంజీవి ఈ సినిమాను వేరే నిర్మాతకు అప్పగించడం ఇష్టంలేకనే రామ్ చరణ్ ముందుకొచ్చాడని తెలిపారు. వందల కోట్ల రూపాయల బడ్జెట్ ను పక్కనపెడితే, ఓ బాధ్యతతో, ఇష్టంతో ఈ సినిమా చేయడం చాలా అవసరమని.. అందుకే బయట నిర్మాతల కంటే చరణ్ అయితే మంచిదని భావించినట్టు స్పష్టంచేశారు.