ఆధిపత్య పోరు.. ఒత్తిడిలో చిరంజీవి..?

“155 సినిమాలు పూర్తిచేశారు.. ఎన్నో రికార్డులు సృష్టించారు.. ఆయనకు ఒత్తిడి కొత్త కాదు.. దశాబ్దాలుగా ఇలాంటివి ఎన్నో చూశారు.. ప్రతి అవరోధాన్ని సక్సెస్ ఫుల్ గా అధిగమించారు.”. ఇలా ఎన్ని సమర్థింపులైనా చేసుకోవచ్చు కానీ…

“155 సినిమాలు పూర్తిచేశారు.. ఎన్నో రికార్డులు సృష్టించారు.. ఆయనకు ఒత్తిడి కొత్త కాదు.. దశాబ్దాలుగా ఇలాంటివి ఎన్నో చూశారు.. ప్రతి అవరోధాన్ని సక్సెస్ ఫుల్ గా అధిగమించారు.”. ఇలా ఎన్ని సమర్థింపులైనా చేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికైతే చిరంజీవి ఒత్తిడిలో ఉన్నారనేది మాత్రం వాస్తవం.

వరుసగా వెక్కిరిస్తున్న ఫ్లాపులు చిరంజీవిని ఇబ్బందిపెడుతున్నాయి. అంతకంటే ఇబ్బంది పెడుతున్న అంశం మరొకటి ఉంది. ఫ్లాపులు చిరంజీవికి కొత్తకాదు, ఇలా ఫ్లాపులొచ్చిన టైమ్ లో ప్రత్యర్థి హీరో బాలకృష్ణ వరుసగా హిట్స్ కొడుతుండడం చిరంజీవి ప్రెషర్ కు ప్రధాన కారణం.

ఇండస్ట్రీలో చిరంజీవి-బాలకృష్ణ మధ్య పోటీ, ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సగటు సినీ ప్రేక్షకుడ్ని ఎవ్వర్ని కదిపినా వీళ్ల దశాబ్దాల బాక్సాఫీస్ వైరం గురించి కథలుకథలుగా చెబుతారు. ఇలాంటి వృత్తిగత పోరులో ప్రస్తుతం బాలయ్య ముందంజలో ఉన్నారు. చిరంజీవి టెన్షన్ కు ప్రధాన కారణం ఇదే.

గడిచిన నాలుగేళ్లుగా చూసుకుంటే, చిరంజీవి ఫ్లాపులే ఎక్కువిచ్చారు. సైరా ఫ్లాప్ అయినా తట్టుకున్నారు, ఆచార్య డిజాస్టర్ అయినా నిలదొక్కుకున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. కానీ ఇవన్నీ ఒకెత్తు, భోళాశంకర్ మరో ఎత్తు. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడమే కాదు, చిరంజీవి ప్రతిష్ఠను దెబ్బతీసింది.

అదే టైమ్ లో బాలకృష్ణ.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో హిట్స్ కొట్టారు. ప్రస్తుతం దసరా బరిలో భగవంత్ కేసరిగా నిలిచారు. సినిమా ఇంకా బ్రేక్-ఈవెన్ అవ్వకపోయినా, నందమూరి ఫ్యాన్స్ అప్పుడే బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ వేశారు.
 
ఈ ప్రచారం చిరంజీవిని ఇప్పుడు మరింత ఒత్తిడికి గురిచేస్తోంది. ఫ్లాప్స్ వచ్చిన ప్రతిసారి తన లైనప్ ను మార్చి జాగ్రత్తపడే చిరంజీవి, ఈసారి మరింత జాగ్రత్త పడుతున్నారు. ఏకంగా కూతురు నిర్మాణంలో చేయాల్సిన సినిమాను కూడా పక్కనపెట్టారంటే, తన కెరీర్ పై చిరంజీవి ఎంత కేర్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

భగవంత్ కేసరి తర్వాత కూడా బాలయ్య లైనప్ బాగుంది. అదే టైమ్ లో చిరంజీవి పిక్ చేసుకుంటున్న దర్శకుల జాబితా అంత స్ట్రాంగ్ గా కనిపించడం లేదు. అందుకే కల్యాణకృష్ణను ఆయన పక్కనపెట్టారు. ఎన్నో లెక్కలు వేసుకొని మరీ వశిష్ఠకు (బింబిసార ఫేమ్) అవకాశమిచ్చారు. ఇక్కడే మరో అంశాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

కథల విషయంలో గడిచిన కొన్నేళ్లుగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే చిరంజీవి.. వశిష్ఠ చెప్పిన స్టోరీపై మాత్రం పలువురి అభిప్రాయాల్ని తీసుకున్నారు. సినిమాను అధికారికంగా ప్రకటించడానికంటే ముందే, ఇండస్ట్రీలో తనకు బాగా సన్నిహితులైన ముగ్గురు, నలుగుర్ని స్టోరీ డిస్కషన్ లో కూర్చోబెట్టి మరీ కథపై వాళ్ల ఒపీనియన్ తీసుకున్నారు. ఆ తర్వాత మాత్రమే యూవీ క్రియేషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇన్నాళ్లూ #మెగా156, #మెగా157, #మెగా158 లాంటి డిస్కషన్లు జరిగేవి. ఇకపై చిరంజీవి ఫోకస్ మొత్తం కేవలం తన 156వ సినిమాపైనా మాత్రమే. ఈ సినిమాతో ఆయన కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. పైగా ఇది ఆషామాషీ సినిమా కాదు. 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో వస్తున్న సినిమా. అందుకే చిరంజీవి ఒత్తిడిలో ఉన్నారు.

ఈ సినిమా కోసం ఆయన ఎన్నో సెంటిమెంట్స్ ఫాలో అవుతున్నారు. లేట్ అయినా లేటెస్ట్ గా హిట్ కొట్టాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఈ గ్యాప్ లో బాలకృష్ణ మరో సక్సెస్ కొడితే, చిరంజీవిపై ఒత్తిడి మరింత పెరగడం ఖాయం. ఎందుకంటే, రాజకీయాలు వద్దనుకొని, సినిమాలే లోకమని ప్రకటించి మరీ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. అటు బాలయ్య మాత్రం ఓవైపు రాజకీయాలు చేస్తూనే, మరోవైపు సినిమాలతో కూడా విజయాలు అందుకుంటున్నారు. మెగా ఒత్తిడికి ఈ ఒక్క రీజన్ చాలు.