మోకాలికి ఆపరేషన్​ చేసే హాస్పిటల్​ హైదరాబాద్​లో లేదా?

సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఏదైనా అనారోగ్యం వస్తే ఉన్న ఊళ్లో వైద్యం చేయించుకోరు. తెలుగు రాష్ట్రాల విషయం తీసుకుంటే…సినిమా తారలు, బడా రాజకీయ నాయకులంతా హైదరాబాద్​లోనే ఉంటారు. ఏపీ రాజకీయ నాయకులు కూడా…

సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఏదైనా అనారోగ్యం వస్తే ఉన్న ఊళ్లో వైద్యం చేయించుకోరు. తెలుగు రాష్ట్రాల విషయం తీసుకుంటే…సినిమా తారలు, బడా రాజకీయ నాయకులంతా హైదరాబాద్​లోనే ఉంటారు. ఏపీ రాజకీయ నాయకులు కూడా వైద్యం చేయించుకోవడానికి హైదరాబాదుకే వస్తారు. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాదులో వైద్య రంగాన్ని ఎలా అభివృద్ధి చేశామో కేసీఆర్​ సర్కారు రోజూ గొప్పలు చెప్పుకుంటూ ఉరంటుంది. 

నిజానికి ఇక్కడ కార్పొరేట్​ ఆస్పత్రులు చాలా ఉన్నాయి. ఒక్కో కార్పొరేట్​ ఆస్పత్రికి బ్రాంచీలు కూడా ఉన్నాయి. పేరు పొందిన, నిపుణులైన వైద్యులు ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కూడా కార్పొరేట్​కు దీటుగా అభివృద్ధి చేశామని ప్రభుత్వం  చెప్పుకుంటూ ఉంటుంది. అది ఎంతవరకు నిజమనేది అక్కడ వైద్యం చేయించుకుంటున్నవారు చెప్పాలి. 

సాధారణంగా డబ్బున్నవారు, రాజకీయ నాయకులు (వీళ్లకూ దండిగా డబ్బు ఉంటుంది కదా) కార్పొరేట్​ ఆస్పత్రులకే వెళతారు. కొందరు వేరే రాష్ట్రాలకు, విదేశాలకూ వెళతారు. సీఎం కేసీఆర్​ సాధారణంగా యశోదా ఆస్పత్రికి వెళతారు. రెండు మూడు సార్లు కంటి చికిత్స కోసం ఢిల్లీకి వెళ్లారు. ప్రభుత్వ ఆస్పత్రుల గురించి గొప్పలు చెప్పే కేసీఆర్​ ఏనాడూ వాటి జోలికి వెళ్లలేదు. 

ఇక అసలు విషయాకి వస్తే….మెగాస్టార్​ చిరంజీవి మోకాలి సర్జరీ కోసం ఢిల్లీ వెళ్లాడు. నిజానికి అది పెద్ద సమస్య కాదు. హైదరాబాద్​లో మోకాలి చిప్పలే మారుస్తుంటే చిన్న ఆపరేషన్​ చేయలేరా? చిరంజీవి మోకాలికి స్వల్ప శస్త్ర చికిత్స జరిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో అడ్మిట్ కాగా… శస్త్ర చికిత్స చేసినట్లు సమాచారం. మోకాలిలో తరచుగా నొప్పి వస్తుండడంతో పరీక్షలు చేయించుకోగా… ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. 

ఈ క్రమంలో ఎలాంటి కోత లేకుండా ఆర్థ్రోస్కోపిక్ విధానంలో ఇన్ఫెక్షన్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి ప్రస్తుతం ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటుంటున్నారట. మరో నాలుగు, ఐదు రోజుల్లో హైదరాబాద్ కు తిరిగి వస్తారు.  భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడ్డ మెగా స్టార్ 2016లో కుడి, ఎడమ భుజాలకు కూడా ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు మోకాలి నొప్పి కారణంగా మరోసారి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.  

మెగాస్టార్‌కు కోట్ల రూపాయల సంపన్నుడు కాబట్టి ఢిల్లీ వెళ్లాడు. అవసరమైతే విదేశాలకూ వెళతాడు.