సైరాలో నా పాత్ర చనిపోయినా షాక్ అనిపించదు

సైరా సినిమాలో చిరంజీవి పాత్ర చనిపోతుందని ప్రేక్షకుల్ని మానసికంగా సిద్ధం చేసే కార్యక్రమాన్ని కొన్ని రోజులుగా కొనసాగిస్తోంది యూనిట్. ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు చిరంజీవి కూడా అదే…

సైరా సినిమాలో చిరంజీవి పాత్ర చనిపోతుందని ప్రేక్షకుల్ని మానసికంగా సిద్ధం చేసే కార్యక్రమాన్ని కొన్ని రోజులుగా కొనసాగిస్తోంది యూనిట్. ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు చిరంజీవి కూడా అదే పని చేస్తున్నారు. తన పాత్ర చనిపోతుందని, ప్రేక్షకులు షాక్ ఫీలవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు.

“ఇది చరిత్ర కాబట్టి, ప్రేక్షకులు కూడా మెంటల్లీ ప్రిపేర్ అయి వస్తారు కాబట్టి వాళ్లకు షాక్ గా ఉండదు. నరసింహారెడ్డిలో పాత్రను మాత్రమే చూస్తారు, నన్ను చూడరని అనుకుంటున్నాను. నరసింహారెడ్డి పాత్ర చనిపోతుందని అందుకే ముందు నుంచి చెబుతూ వస్తున్నాం. కాబట్టి ప్రేక్షకులు నిరాశపడరనే అనుకుంటున్నాను. అంతేకాదు, క్లయిమాక్స్ తర్వాత ఓ గొప్ప ఫీలింగ్ తో ప్రేక్షకుడు బయటకొస్తాడనే నమ్మకం నాకుంది.”

బ్రిటిష్ వాళ్లు నరసింహారెడ్డి తలను కోటగుమ్మానికి 30 ఏళ్ల పాటు వేలాడి ఉంచారని, ప్రజల్లో భయం పుట్టించేందుకే బ్రిటిషర్లు ఆ పనిచేశారని చెప్పిన చిరంజీవి.. ఆ సన్నివేశం మాత్రం సైరా సినిమాలో ఉండదని స్పష్టంచేశారు. క్లయిమాక్స్ లో వచ్చే పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా ముగుస్తుందని, అదంతా చాలా భావోద్వేగంతో నిండి ఉంటుందని చెబుతున్నారు.

“ఈ సినిమా స్టార్ట్ అయినప్పట్నుంచి నేను నవ్వడం మరిచిపోయాను. సరదాగా స్టెప్ వేయడం కూడా మరిచిపోయాను. చాలా సీరియస్ అయిపోయాను. వచ్చే సినిమాకు మాత్రం డాన్సులు, కామెడీ మస్ట్ గా ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే నాకు నేనుగా అవన్నీ మిస్ అవుతున్నాననే భావన కలిగింది.”

ఇలా సైరాలో తన పాత్ర సీరియస్ గా ఉంటుందని, ఎలాంటి డాన్సులు ఉండవని చెబుతున్నారు చిరంజీవి. ఇక తన డ్రీమ్ క్యారెక్టర్ భగత్ సింగ్ పాత్ర గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇక తను ఆ పాత్ర చేయలేనని, తన వారసుడు రామ్ చరణ్, ఆ క్యారెక్టర్ చేస్తే చూడాలని ఉందంటున్నారు చిరు.

“భగత్ సింగ్ క్యారెక్టర్ నేను చేద్దామని అనుకున్నాను. కానీ ఎవ్వరూ ఆ పాత్రతో నా వద్దకు రాలేదు. చరణ్ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఉన్నది ఉన్నట్టు చేయకూడదు. ఎంతో కొంత ఫిక్షన్ యాడ్ చేయాల్సిందే. ఆర్-ఆర్-ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రను ఎలాగైతే మార్చి యంగ్ క్యారెక్టర్ లో చూపిస్తున్నారో.. అలాగే భగత్ సింగ్ పాత్రను కూడా ఇంకో కోణం నుంచి ఆలోచించి కొత్తగా చూపించగలిగితే, అది చరణ్ చేయగలిగితే అత్యద్భుతంగా ఉంటుంది.”

రామ్ చరణ్ నిర్మాతగా మారి, సైరా సినిమాను తనకు, ప్రేక్షకులకు ఓ గిఫ్ట్ గా అందించాడని.. ఓ తండ్రిగా తను చరణ్ కు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనే అంశంపై ఇంకా ఆలోచించలేదంటున్నారు చిరంజీవి. సైరా రిలీజైన తర్వాత తప్పకుండా చరణ్ కు బహుమతి ఇస్తానంటున్నారు.

సౌత్ స్టార్ హీరోలు.. బాలీవుడ్ లో లాంగ్వేజ్  ప్రాబ్లమ్!