గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, చిరంజీవి మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా పరంగానే కాకుండా.. వ్యక్తిగత స్థాయిలో, కుటుంబ పరంగా కూడా ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. అందుకే బాలు పేరి చెబితే చిరంజీవి చలించిపోతారు. అలాంటి సందర్భం ఇంకోటి వచ్చింది.
ఈరోజు ఎస్పీ బాలు 75వ జయంతి. చిరంజీవితో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు వర్చువల్ గా సమావేశమై.. బాలుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలుతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు చిరంజీవి. మరీ ముఖ్యంగా ఓ అంశానికి సంబంధించి తామిద్దరి మధ్య ఎప్పుడూ చిన్న గొడవ జరిగేదనే విషయాన్ని చిరంజీవి బయటపెట్టారు.
“బాలు అన్నయ్యకు నాకు ఎప్పుడూ ఓ గొడవ ఉండేది. నన్ను ఎప్పుడూ బాలు ఒకటి అడిగేవారు. పొటిన్షియల్ ఉన్న ఆర్టిస్టువు నువ్వు, ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే ఎందుకు చేస్తావ్, చట్రం నుంచి బయటకొచ్చి కొన్ని సినిమాలు చేయమని అడిగేవారు. శుభలేఖ, ఆరాధన, స్వయంకృషి, రుద్రవీణ లాంటి సినిమాలు చేస్తున్నానని చెప్పేవాడ్ని. కానీ ప్రజలు నా నుంచి ఏం ఆశిస్తున్నారో అదే ఇవ్వాలంటాను నేను.
అప్పటికీ నా సొంత బ్యానర్ పెట్టి రుద్రవీణ తీశాను. కానీ ఆ సినిమాతో నిర్మాత నాగబాబుకు ఏం మిగల్లేదు అనేవాడ్ని. కానీ బాలు గారు ఒప్పుకునేవారు కాదు. ఇంకా చేయమనే వారు. కానీ కమర్షియల్ గా నా ఇమేజ్ పెరిగిపోయింది. ఆర్టిస్టిక్స్ సినిమాలు చేయడానికి కుదర్లేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలని నేను అనేవాడ్ని. బాలు గారు ఒప్పుకునేవారు కాదు. ఇలా మామధ్య ఎప్పుడూ ఇదే డిబేట్ జరిగేది.”
బాలు అన్నయ్య కోరుకున్నట్టు తను ఎక్కువగా ఆర్టిస్టిక్ సినిమాలు, నటనను బయటపెట్టే పాత్రల్ని పోషించలేకపోయాననే ఆవేదనను చిరంజీవి వ్యక్తంచేశారు. ఇప్పటికీ బాలు గారి పేరు చెబితే.. 80ల్లోకి వెళ్లిపోతానని, చెన్నైలో అప్పటి జ్ఞాపకాల దొంతర్లలోకి జారిపోతానని అన్నారు చిరంజీవి.