మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన నేపథ్యంలో మరి ఆ ప్రముఖుల మాటేమిటి? అనే ప్రశ్న ఉదయిస్తోంది.
ఆ ఇద్దరు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రముఖ హీరో నాగార్జున. లాక్‌డౌన్ కారణంగా ఆగిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన ట్వీట్ చేశారు.
అయితే తనకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్‌లో ఉంటున్న ఆయన … గత 4-5 రోజులుగా తనను కలిసిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం శనివారం ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సహ నటుడు, మిత్రుడైన నాగార్జునతో వెళ్లి కలుసుకున్నారు.
ఈ సందర్భంగా లాక్‌డౌన్ అనంతరం సినిమా షూటింగ్‌లు, ఇతర సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మాణం కోసం దాదాపు 2 వేల ఎకరాలు కేటాయించనున్నట్టు ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పిన విషయం తెలిసిందే.
కాగా చిరంజీవికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో కేసీఆర్, నాగార్జున, ఇతర ప్రముఖుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి.
అందులోనూ తనను గత నాలుగైదు రోజుల్లో కలిసిన వాళ్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలనే స్వయంగా చిరంజీవి కోరడంతో అందరి దృష్టి కేసీఆర్, నాగార్జునతో పాటు ఎంపీ సంతోష్‌రావు తదితరులపై పడింది. చిరంజీవిని కలుసుకున్న ప్రముఖులు తమ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.