చిరు లీక్స్ గురించి అందరికీ తెలిసిందే. తన సినిమాల గురించే కాకుండా, పక్కోళ్ల సినిమాల గురించి కూడా లీక్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఆచార్య సినిమా టైమ్ లో చిరు లీక్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత ఆ ట్రెండ్ ను ఆయన అలానే కొనసాగిస్తూ వస్తున్నారు.
తాజాగా చిరు లీక్స్ రాజకీయాలకు కూడా విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ప్రస్థానం ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఏ పదవి ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.
పవన్ కల్యాణ్ కు చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని కొందరు. ఆ పదవితో పాటు హోం శాఖ కూడా ఇస్తారని మరికొందరు చెప్పుకుంటున్నారు. అత్యంత ప్రాధాన్యం కలిగిన హోం శాఖను మరో పార్టీకి కట్టబెట్టేంత సాహసం చంద్రబాబు చేయరని ఇంకొందరు వాదిస్తున్నారు.
ఓవైపు ఇలా చర్చలు నడుస్తుండగానే పవన్ కల్యాణ్ పదవిపై లీక్స్ వదిలారు చిరంజీవి. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి.. తన ట్వీట్ లో పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎం అని సంబోధించారు.
దీంతో పవన్ కల్యాణ్ కు కేటాయించిన ఒక పదవి ఏంటనేది తేలిపోయింది. చంద్రబాబు అధికారికంగా ప్రకటించకముందే, చిరంజీవి డిప్యూటీ సీఎం పోస్టును బయటపెట్టేశారు. ఇప్పుడీ పదవితో పాటు, పవన్ కు మరో మంత్రిత్వ శాఖ కేటాయిస్తారా లేదా అనేది మరికాసేపట్లో తేలిపోతుంది.