చిరంజీవి-కొరటాల సినిమా మరోసారి వాయిదా పడిందంటూ పుకార్లు వస్తున్నాయి. నిజానికి గతంలో 2 సార్లు ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అయిన మాట వాస్తవమే. కానీ ఈసారి మాత్రం షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వలేదు. రెగ్యులర్ షూటింగ్ తేదీ ఫిక్స్ అయింది. జనవరి 2 నుంచి చిరంజీవి-కొరటాల సినిమా సెట్స్ పైకి వస్తుంది.
గతంలో 2సార్లు ఈ సినిమా షూటింగ్ వాయిదాపడ్డానికి కారణం చిరంజీవి లుక్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడమే. ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఎలా ఉండాలనే అంశంపై కొరటాల చాలా కసరత్తులు చేశాడు. ఫైనల్ గా చిరంజీవి లుక్ టెస్ట్ ముగిసింది. అన్నపూర్ణ స్టుడియోలో చిరంజీవిపై నిర్వహించిన ఫొటోషూట్ లో అతడి లుక్ ను ఫిక్స్ చేశారు. దీంతో సినిమా రెగ్యులర్ షూటింగ్ కు లైన్ క్లియర్ అయింది.
రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ అవ్వడంతో ఇప్పుడు రామ్ చరణ్ ఎప్పీయరెన్స్ పై అందరి దృష్టి పడింది. ఈ సినిమాను నిర్మించడమే కాకుండా, ఇందులో ఓ కీలక పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. దీనిపై త్వరలోనే యూనిట్ ఓ క్లారిటీ ఇవ్వబోతోంది. అయితే చరణ్ నటించినా అది చాలా చిన్న పాత్ర అని తెలుస్తోంది.
ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో నక్సలిజం ఎలిమెంట్ తో ఈ సినిమా రాబోతోంది.. కాకపోతే ఇది ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే కనిపిస్తుంది.