మెగాస్టార్ కు ఎలా వుందో కానీ ఆయన పీఆర్ టీమ్ కు మాత్రం జనవరి 13 వస్తోంది అంటే గుండె లబ్ డబ్ మంటోంది. సినిమా విడుదలైన తరువాత ఎలా వుంటుందో అన్న సంగతి అలా వుంచితే మాంచి ఓపెనింగ్ పడాలి. కానీ అప్పటికే రెండు సినిమాలు థియేటర్లో వుంటాయి. మాంచి టాక్ స్ప్రెడ్ కావాలి. నెగిటివిటీ రాకూడదు. ఆచార్య, గాడ్ ఫాదర్ అనుభవాలు దృష్టిలో వుంచుకుని ఏదో ఒకటి చేయాల్సి వుంది. ఇలా కిందా మీదా అవుతున్నారు.
వీళ్ల పరిస్థితి ఇలా వుంటే నిర్మాతలు మైత్రీ మూవీస్ కు ఎలా వుందీ అంటే..ఇద్దరు హీరోలు తమకు కావాల్సిన వారే. అందువల్ల ఒకరికి తక్కువ లేదు. ఒకరికి ఎక్కువా లేదు. అందువల్ల ఎవరి హీరో పీఆర్ టీమ్ వాళ్లే ఏం కావాలో చేసుకోండి..తాము డబ్బలు ఇచ్చేస్తాం. తక్కువ చేసాము అనే మాట తమకు వద్దు అనే ఆలోచనలో వుంది మైత్రీ మూవీస్.
ఇలాంటి నేపథ్యంలో జనవరి 8న విశాఖలో మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టాలన్న ఆలోచనలు సాగుతున్నాయి. దీని కోసం హైదరాబాద్ లో ఓ ప్రత్యేక రైలును నడపాలని మెగాస్టార్ స్వంత పీఆర్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా. హైదరాబాద్ లో బయలు దేరిన రైలుకు 20 బోగీలు తగిలిస్తే ఒక్కో ఊరుకు ఒక్కో బోగీ వంతున కేటాయించి జనాలను సమీకరించాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది.
గమ్మత్తేమిటంటే చిరంజీవికి స్వంత పీఆర్ టీమ్ రాక ముందు నుంచి వున్న సీనియర్ ఫ్యాన్స్ ఎవ్వరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు. స్వామినాయుడు లాంటి వాళ్లు ప్రస్తుతం ఫ్యాన్స్ కార్యక్రమాలకు దూరంగా కేవలం బ్లడ్ బ్యాంక్ కు పరిమితమైపోయారు. ఇప్పుడు ఈ ప్లాన్ సంగతి తెలిసి సీనియర్ ఫ్యాన్స్ గుర్రు మంటున్నారు.
మరీ రైలు పెట్టి జనాలను తరలించాల్సినంత దుస్థితికి చేరుకున్నానా మా మెగాస్టార్ అని అంటున్నారు. విశాఖలో సభ పెడితే చాలు లక్షమంది వస్తారు..తరలించాల్సిన అవసరం ఏమిటి అంటున్నారు. అంతే కాదు, ఆ మధ్య ‘పక్కా కమర్షియల్’ సినిమా ఫంక్షన్ కు చిరంజీవి వస్తే ఇలాగే ఓ కాలేజీ నుంచి బస్సులో జనాలను తరలించారని, దానికి ఖర్చు నిర్మాత భరించారని ఇప్పుడు వెల్లడిస్తున్నారు. ఆ మధ్య ఇదే పీఆర్ టీమ్ మీడియాను విడతలు విడతలుగా మెగాస్టార్ ను కలిపించి మెహర్బానీ చేయడం కూడా వికటించింది. కొంత మందిని పిలిచి, కొంత మందిని పిలవక ఏదేదో చేసారు.
ఇవన్నీ చీప్ ట్రిక్స్ అని, అయినా ప్రత్యేక రైలు పెట్టిన సినిమాలు కానీ, పార్టీలు కానీ సక్సెస్ కాలేదని పరోక్షంగా ఆంధ్రావాలా, ప్రజారాజ్యం సంగతులు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద మెగా ఫ్యాన్స్ కు మెగా స్వంత పీఆర్ టీమ్ కు మధ్య ఏదో జరుగుతున్నట్లే వుంది.