సినిమా అనేది పప్పు, ఉప్పు, బియ్యం లాగ కనీసావసరం కాదు..ప్రభుత్వం తలదూర్చి ధరల నియంత్రణ చేయడానికి.
సినిమా అనేది వినోదావసరం మాత్రమే. అది కూడా ప్రత్యామ్నాయం లేని వినోదం అంతకన్నా కాదు. నచ్చిన వాడొస్తాడు. నచ్చని వాడు మరొక వినోదం ఏదో వెతుక్కుంటాడు.
సినిమా వ్యాపారం మీద ప్రభుత్వ పెత్తనం వింతగానే ఉంది.
ఒక స్టార్ హోటల్లో ఫలానా ఐటం కి అంత రేట్ ఎందుకు? ఇంతే పెట్టాలి..అంటే ఎలా ఉంటుంది? ఆ లగ్జరీ కావాల్సినవాడు వస్తాడు. వద్దనుకున్నవాడు రాడు.
అయినా ఒక రేట్ పెడితే జనం రావట్లేదనుకున్నాప్పుడు వ్యాపారస్థులే రేట్లు తగ్గిస్తారు. డిమాండ్ ఉన్నప్పుడు తగ్గించరు..పెంచుతారు. అది ప్రాధమిక వ్యాపార సూత్రం.
సామాన్యుడు టిక్కెట్లు కొనలేక ఇక్కట్లు పడుతున్నాడు కాబట్టి టికెట్ ధరలపై సీలింగ్ అంటోంది ప్రభుత్వం. ఈ నియంత్రించిన రేట్లతో థియేటర్స్ నడపడం మా వల్ల కాదు బాబోయ్ అంటున్నారు ఎగ్జిబిటర్స్.
టికెట్ ధరలపై సీలింగ్ వల్ల ఏం ఒరుగుతుంది? బ్లాక్ మార్కెట్ నిద్రలేస్తుంది. ఒక రకంగా టికెట్ ధరల్ని డిమాండ్ ని బట్టి నిర్ణయించే వెసులుబాటు ఎగ్జిబిటర్స్ కి ఇవ్వడం వల్ల బ్లాక్ మార్కెట్ కి కళ్లెం వేసినట్టయ్యింది.
అయినా నల్లధనంగా కాకుండా తెల్లధనంగా సినిమావాళ్లు సంపాదించుకుని దానికి తగ్గట్టుగా ప్రభుత్వానికి పన్ను కడుతున్నప్పుడు ఇంకా పెంచుకోమని ప్రోత్సహించకపోగా ధరలు తగ్గించి ఇండస్ట్రీ పీకనొక్కడేమిటి?
పైగా రెమ్యునరేషన్స్ పెరిగినా, బడ్జెట్ పెరిగినా దాని వల్ల కొన్ని వందల కుటుంబాలు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతాయి. ఉదాహరణకి బడ్జెట్ ఎక్కువున్న సినిమాకి పనిచేసే టెక్నీషియన్ కి రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుంది. దానివల్ల అతను క్రమంగా స్థిరపడతాడు. ఇల్లు కొనుక్కుంటాడు, కారు కొనుక్కుంటాడు, డ్రైవర్ ని, అసిస్టెంటుని పెట్టుకుని కొన్ని కుటుంబాలకి ఉపాధి కల్పిస్తాడు.
అదే బజెట్ తగ్గితే అతని ఆదాయం వేలల్లోకి దిగుతుంది. పిల్లల స్కూలు ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బంది పడాలి.
కాబట్టి ఏ రంగమైనా ఎదగాలని కోరుకోవాలి కదా. వివిధ రంగాలు ఆర్థికంగా ఎదగడం వల్ల దాని ప్రభావం అన్ని రంగాల మీద పరోక్షంగా పడుతుంది కదా.
24 విభాగాలున్న చిత్రపరిశ్రమలో నిజానికి ఒక్కో విభాగం ఒక్కో పరిశ్రమంత ఎదుగుతోంది. వీ.ఎఫ్.ఎక్స్ కంపెనీల్లో చదువుకున్న ఇంజనీర్స్ ఎందరో మంచి జీతాలు సంపాదిస్తున్నారు. ప్రతిభ చూపిస్తే ఆ కంపెనీలకి సినిమారంగం నుంచి వచ్చే ఆదాయం చాలా ఎక్కువ. పరోక్షంగా ఇలా ఎంతమందినో సినిమా రంగం పోషిస్తోంది.
అలాగే కాస్ట్యూం డిజైనింగ్ రంగం, ఆర్కిటెక్చర్ రంగం ఇలా ఎన్నో రంగాలు భారీ బడ్జెట్స్ వల్లే పైకొస్తున్నాయి. పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు పెద్ద పెద్ద స్టూడియోస్ ని బుక్ చేసుకుంటాయి. దాని వల్ల ఆ స్టూడియోలో పనిచేసే వందలాది మంది ఉపాధి కోల్పోకుండా ఉంటారు. అలాగే కేటరింగ్ బిజినెస్ కూడా. బడ్జెట్ తగ్గితే క్యాటెరింగ్ వాళ్లకి గుడ్ బై చెప్పి అందర్నీ ఇంటినుంచి ఎవరి క్యారేజీ వాళ్లని తెచ్చుకోమని చెప్పే రోజులు కూడా రావొచ్చు.
ఇదేమైనా స్వాగతించతగ్గ పరిణామమా?
నెల్లూరు జిల్లా సూళ్లూరిపేటలో దేశం గర్వించదగ్గ అతి పెద్ద స్క్రీన్ ఉన్న సినిమా హాల్ ఉంది. యూవీ వాళ్ల ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అది. చెన్నై నుంచి కూడా సినిమాలు చూడ్డానికి ఈ థియేటర్ కి వస్తుంటారు జనం. ఇప్పుడు విధించిన స్లాబ్ వల్ల హౌస్ ఫుల్ అయినా కూడా ఆ థియేటర్ నడపడం ఎవరి తరం కాదు. ఆ హాల్ సంగతి పక్కన బెడితే అసలు సాదాసీదా సినిమా హాల్ ని కూడా ఈ స్లాబ్స్ తో నడపడం అసాధ్యం.
ప్రభుత్వం కూడా సినిమా రంగాన్ని ఎక్కువగా సంపాదించేలా చేసి మరింత ఎక్కువగా ట్యాక్స్ వసూలు చేసేలా చూడాలి. అంతేగానీ ఏం సాధించడానికో ఈ సాధింపు..అన్నట్టుండకూడదు.
– పేరు చెప్పి ప్రభుత్వానికి శత్రువుకాలేని ఒక నిర్మాత