తారల్ని తాకుతున్న సినీతారల పారితోషకాలు

సినిమా నటుల రెమ్యునరేషన్స్ చుక్కల్ని తాకుతున్నాయి. ప్రతి సినిమాకి ఎన్ని కోట్లు మార్కెట్ పెరిగింది అనే లెక్కల్లోనే హీరోలున్నారు తప్ప ఎక్కడా తగ్గడం లేదు. బాహుబలీయమైన హిట్టు కొట్టడం వల్ల ప్రభాస్ రేంజ్ అమాంతం…

సినిమా నటుల రెమ్యునరేషన్స్ చుక్కల్ని తాకుతున్నాయి. ప్రతి సినిమాకి ఎన్ని కోట్లు మార్కెట్ పెరిగింది అనే లెక్కల్లోనే హీరోలున్నారు తప్ప ఎక్కడా తగ్గడం లేదు. బాహుబలీయమైన హిట్టు కొట్టడం వల్ల ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగి అతని పారితోషకం రూ. 100 కోట్లను తాకింది. భారతదేశ సినిమా చరిత్రలో వంద మార్కు దాటిన తొలి హీరో ప్రభాసే. ఆ రికార్డ్ తనదే. 

ప్రభాస్ సినిమాలు ఇప్పుడు వరసగా నాలుగున్నాయి. అన్నీ ఈ ఏడాదిలో రిలీజ్ కావాల్సినవే- ఆది పురుష్, సలార్, ప్రోజెక్ట్ కే, మారుతి దర్శకత్వంలో మరొక సినిమా. ప్రతి సినిమాకి వందేసి కోట్ల పారితోషకంతో చేసుకుపోతున్నాడు. 

ఈ రికార్డుని అధిగమించాలని, తొలి 200 కోట్ల హీరో అనిపించుకోవాలని కాబోలు అల్లు అర్జున్ ఇప్పటికే తన రేంజ్ రూ 150 కోట్లు అన్నట్టుగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతానికి అతని చేతిలో పుష్ప-2 మాత్రమే ఉంది. దానికే రూ 150 కోట్ల రెమ్యునరేషన్ అని టాక్. తర్వాత సందీప్ వంగా సినిమా. దాని లెక్కలు అప్పుడే తెలియవు. 

ఇక పోతే రాం చరణ్, ఎన్.టి.ఆర్. వీళ్ళిద్దరిదీ చిత్రమైన పరిస్థితి. ఆర్.ఆర్.ఆర్ తర్వాత వీళ్లకింకా కొత్త మార్కెట్ సృష్టింపబడలేదు. కనుక వీళ్ల రెమ్యునరేషన్ ఏ రేంజుకి వెళ్లిందో క్లారిటీ లేదు. పైగా ఆర్.ఆర్.ఆర్ కి కూడా అసలు వీళ్లు సంపాదించుకున్నది ఎన్ని కోట్లో తెలీదు. ఎందుకంటే వాళ్లు ఆ సినిమా మీద పెట్టిన పెట్టుబడి దాదాపు మూడు నాలుగేళ్లు. అంత కష్టానికి తగిన పారితోషకం వచ్చిందా అంటే అఫీషియల్ లెక్కలు బయటికి రాలేదు. అది పక్కన పెడితే ఆస్కార్ ప్రొమోషన్స్ కోసం వాళ్ళ వాటాలు కూడా పెట్టారు. అంటే తీసుకున్న దాంట్లోంచి భారీ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసినట్టే. అయితే చివరికి లెక్కేసుకుంటే అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అయితే దాని వల్ల కొత్తగా పెరిగిన మార్కెట్ ఎంతో ఇంకా తెలియాలి. 

వీళ్లందరికీ భిన్నంగా ప్రతి సినిమాకి ఎంతో కొంత రెమ్యునరేషన్ పెంచుకుపోతూ ఒకటే స్పీడులో పోతున్నారు రవితేజ, నాని. వీళ్లు కొత్త దర్శకుడినో, కొత్త నిర్మాతనో పట్టుకోవడం పారితోషకం పెంచేసుకోవడం. వీళ్ల రేంజ్ ప్రస్తుతానికి 20 పైమాటే. 

ఇక పవన్ కళ్యాణ్ విషయానికొద్దాం. టలీవుడ్ లో అందరు హీరోలకంటే వేగంగా సంపాదించేది ఈ నటుడే. 22 రోజుల కాల్షీటుకి 80 కోట్ల రెమ్యునరేషన్ ఒక సినిమాకి. స్వయంగా తానే రోజుకి రెండు కోట్లు సంపాదిస్తున్నట్టు వేదిక మీదనే చెప్పాడు.

హీరోల్లో తనకంటూ మార్కెట్ ఉన్నా, ఇప్పటికీ లీగ్ లో ఉన్నా ఎంత అడగాలో, ఎలా పెంచుకోవాలో తెలీని అమాయకుడు బాలకృష్ణేనేమో. ఇప్పటికీ ఈయన రేంజ్ 12-14 కోట్ల పరిధిలోనే ఉంది. ఈ మధ్యనేదో 20 కోట్లు అడుగుతున్నట్టు వినిపిస్తున్నా అందులో నిజమెంతో తెలీదు. 

వెంకటేష్ మార్కెట్ ని అనుసరించి ఆయన రెమ్యునరేషన్ సుమారు 5 కోట్లు. కానీ బూతు సీరియల్స్ లో నటిస్తే ఆయనకి డబుల్ పారితోషకం లభిస్తోంది. ఆ విధంగా ఆయన రామానాయుడు కొడుకుగా కాకుండా “రానా నాయుడు” నటుడిగా అపకీర్తిని మూటకట్టుకుని ముందుకుపోతున్నాడు. 

ఇక హీరోయిన్స్ లో ఒక్క సీతారామం దెబ్బకి మృణాల్ ఠాకూర్ కి ఏకంగా మూడు కోట్లు పారితోషికం ఇస్తున్నారు నిర్మాతలు. 

ఎలా చూసుకున్నా టాలీవుడ్లో డబ్బులు గుమ్మరిస్తున్నారు ప్రొడ్యూసర్లు. వ్యాపారం కంటే ఒకానొక గ్యాంబ్లింగ్ ధోరణే ఉంటోంది ఇందులో. హీరోలకి హై రెమ్యునరేషన్ ఇస్తున్న నేపథ్యంలో సినిమాలో ఇతర నటీనటులు, నిర్మాణ విలువలు తదితరమైన అంశాలేవీ పట్టించుకోవడం లేదు. తమకి కావాల్సిన లెక్కొస్తే చాలు…అనేట్టున్నారు. అదీ పరిస్థితి. 

శ్రీనివాసమూర్తి