సిని’మా’ రంగంలో 95% కమ్మ కులమేనా?

అప్పట్లో ఎస్వీ రంగారావుగారిని అందరూ ఏకగ్రీవంగా తెలుగు నటుల సంఘానికి ప్రెసిడెంటుగా ఉండమని కోరితే ఆయన “నన్ను కాదు, గుమ్మడి గారిని పెట్టండి ప్రెసిడెంటుగా” అన్నారని మోహన్ బాబు ఈ మధ్య ఒక ప్రసంగంలో…

అప్పట్లో ఎస్వీ రంగారావుగారిని అందరూ ఏకగ్రీవంగా తెలుగు నటుల సంఘానికి ప్రెసిడెంటుగా ఉండమని కోరితే ఆయన “నన్ను కాదు, గుమ్మడి గారిని పెట్టండి ప్రెసిడెంటుగా” అన్నారని మోహన్ బాబు ఈ మధ్య ఒక ప్రసంగంలో చెప్పారు. 

నేనంటే నేనని కాకుండా, ఎవరికి సినిమాలున్నాయో ఎవరికి లేవో అనే లెక్కల ప్రాతిపదికన కాకుండా, నిస్వార్థంగా పదవులు తమను కోరి వచ్చినా సున్నితంగా తిరస్కరించి అర్హులకి ఆ పదవినిచ్చే వాతావరణం అప్పట్లో ఉండేదని మోహన్ బాబు భావన. 

కానీ దీనిని కొందరు కులం నేపథ్యంలో అర్థం చేసుకున్నారు. అప్పట్లో కాపు సినీపెద్ద ఒక కమ్మ నటుడిని నాయకుడిగా ఎన్నుకున్నట్టుగా ఇప్పటి కాపుకులపెద్ద ఎన్నుకోలేదని కొందరు అర్థం తీసారు.

దీనిపై కొన్ని సోషల్ మీడియా పోస్టులు కనపడ్డాయి. రీడింగ్ కి, రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ కి ఇదే తేడా. ఎవరికి తోచింది వాళ్లు అనుకోవచ్చు. ఒకవేళ మోహన్ బాబు చెప్పదలచుకున్నది కూడా ఇదే అనుకుంటే ఆయన చాలా పద్ధతిగా చెప్పారని అనుకోవాలి. ఎందుకంటే కులాల ప్రస్తావన బహిరంగంగా ఎప్పుడూ చెయకూడదు. అది చాలా సున్నితమైన అంశం. 

ఈ నేర్పు కోట శ్రీనివాసరావుకి లేకపోవడం ఆశ్చర్యం. సినిమా రంగంలోనూ, “మా”లోనూ కులాల గొడవ నిజంగా ఉందా అనే ఒక ప్రశ్నకు సమాధానంగా “ఉన్నదే అది” అని చెప్తూ, తాను తన కెరీర్ మొత్తంలో 95% కమ్మవారిపైనా ఆధారపడి తిన్నానని, కనుక తాను కమ్మ పక్షపాతినని చెప్పారు. మిగిలిన 5% లో రెడ్లు, రాజులు గురించి ప్రస్తావించారు తప్ప కాపుల ప్రస్తావన తీసుకురాలేదు. 

ఈ మాటల వల్ల కోటపై గౌరవం పోయిందనికూడా చాలా మంది పోస్టుల్లో రాసారు. 

నాగబాబు ఈ మధ్యన కోట శ్రీనివాసరావుని తక్కువచేసి మాట్లాడినప్పుడు కోటపై కొందరికి సానుభూతి కలిగింది. కానీ ఇలా డైరెక్టుగా తాను కమ్మవారికే మద్దతునిస్తానని దానికొక అర్థంలేని కారణం చెప్పడం వల్ల చాలామంది అసహ్యించుకోవడం కనిపించింది. 

ఆయన మాటల్లో ఎందుకు అర్థం లేదో గమనిద్దాం. 

కోట శ్రీనివాసరావు సినిమాల్లోకొచ్చింది 1978లో. చిరంజీవి తొలి సినిమా, కోట శ్రీనివాసరావు తొలి సినిమా ఒకటే- “ప్రాణం ఖరీదు”. అందులో ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టిన కోట క్రమంగా ఎదిగి పెద్దనటుడయ్యాడు. సమాంతరంగా చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాల్లో కోట నటించారు. ఉదాహరణకి అశ్వినీదత్ లాంటి నిర్మాత చిరంజీవిని పెట్టి ఎన్నో సినిమాలు తీసారు. దానికి కోదండరామిరెడ్డో, దాసరి నారాయణ రావో దర్శకత్వం వహించే వారు. 

అశ్వినిదత్తు తీసారని జనం సినిమాలు చూసేయలేదు. హీరో చిరంజీవని, దర్శకుడు ఫలానా అని చూసారు. చూస్తున్నారు కాబట్టి వాళ్లు తీసారు. ఇక్కడుండేది వ్యాపారం తప్ప కులం కాదు. కనుక కమ్మవారి దయవల్లే సినిమారంగంలో అందరూ బతికారనుకోవడం, మిగిలిన అందర్నీ అడ్డం పెట్టుకుని కమ్మవారు బతికారనుకోవడం.. రెండూ తప్పే. 

సినిమా రంగం మొత్తం 95% కమ్మవారి దయవల్లే ఎదిగింది అన్నట్టుగా కోట చేసిన వ్యాఖ్యలు కమ్మవారికేమో గానీ మిగిలినవారికి మాత్రం మింగుడు పడదు. ఎందుకంటే ఇక్కడ అన్ని కులాలకు చెందిన నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తారు. అందరి సమిష్టి కృషి వల్ల సినిమా రంగం ఎదిగింది. 

ఇక్కడ కోట తన గురించే చెప్పుకున్నా 1978 తర్వాత సినీరంగంలోకి వచ్చిన ఎవ్వరైనా 95% కమ్మవారి దయవల్ల బతికినవారే అనే అర్థం వచ్చింది. అలా బతికినవాళ్లల్లో ఆయన చిరంజీవిని కూడా కలిపేసారా అనిపిస్తుంది. 

ఏది ఏమైనా ఇన్నాళ్లూ సినీపరిశ్రమలో కులాల ప్రస్తావన గుంభనంగా ఉండేది కానీ ఇలా ఓపెన్ గా మాట్లాడుకోవడం ఉండేది కాదు. కోట శ్రీనివాసరావు మాటలు ఒక కులానికి తక్కిన కులాలకి మధ్య అగాధం పెంచేలా ఉన్నాయే తప్ప తగ్గించేలా లేవు. ఇటువంటి మాటలు ఇకపై ఏ సినీ ప్రముఖులు బహిరంగంగా మాట్లాడకూడదని ఆశిద్దాం. 

శ్రీనివాసమూర్తి