సినిమాకు కథ రాయడం ఎలా?

ఇదేదో ముఫై రోజుల్లో ఏదో ఒక భాష నేర్చుకోవడం టైపు శీర్షికలా వుంటే వుండొచ్చు. కానీ కాస్త ఉపయోగపడే వ్యవహారమే. నిజానికి కథ రచనకు కొన్ని పడికట్టు సూత్రాలు అంటూ వుండవు. ఎందుకంటే కథ…

ఇదేదో ముఫై రోజుల్లో ఏదో ఒక భాష నేర్చుకోవడం టైపు శీర్షికలా వుంటే వుండొచ్చు. కానీ కాస్త ఉపయోగపడే వ్యవహారమే. నిజానికి కథ రచనకు కొన్ని పడికట్టు సూత్రాలు అంటూ వుండవు. ఎందుకంటే కథ అనేది సృజ‌న కనుక. కానీ సినిమా కథ వేరు. పాయింట్ కొత్తగా వుండొచ్చు. చెప్పాల్సిన విషయం కొత్తదై వుండొచ్చు. కానీ సినిమా కథకు, స్క్రీన్ ప్లే కు లేదా స్క్రిప్ట్ కు కొన్ని పడికట్టు సూత్రాలు వుంటాయి. వుంటూనే వుంటాయి. 

దర్శకుడిగా మిస్టర్ పెర్ ఫెక్ట్ లాంటి సినిమాను ఖాతాలో కలిగిన దశరథ్ ఇలాంటి పుస్తకాన్ని అందించారు. ఎ టు జెడ్ స్టోరీ రైటింగ్ అంటూ..కథా రచన అనే పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ముద్రించారు. ఈ పుస్తకానికి సుకుమార్ లాంటి అగ్రదర్శకుడు ముందు మాట రాసారు.

అసలు ఏముందీ పుస్తకంలో… సింపుల్ గా చెప్పాలంటే సినిమా స్క్రీన్ రైటింగ్ పద్దతలు..కాస్త మెళకువలు ఇందులో వున్నాయి. అరడజ‌ను స్టేజ్ లుగా అంటే విభాగాలుగా విభజించి అందించిన ఈ పుస్తకంలో సినిమా కథ రచన గురించి ప్రాధమిక స్థాయి నుంచి ప్రతి అంశాన్నీ విపులంగా వివరించిన వైనం వుంది. గమ్మత్తేమిటంటే తెలుగు సినిమా కథ, స్క్రీన్ ప్లే రచన గురించి వివరంగా వివరించే ఈ పుస్తకం విభాగాలు లేదా చాప్టర్లు కాదంటే అధ్యాయాలు అన్నింటికీ భలే ఇంగ్లీష్ పేర్లు పెట్టడం. 

తెలుగులో కుదరలేదో? లేక ఇంగ్లీష్ కూడా అవసరం అని ఏమైనా అనుకున్నారో? నిజానికి అధ్యాయాలకు పెట్టిన ఇంగ్లీష్ శీర్షికలకు సరైన తెలుగు వాక్యనిర్మాణం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ ఇలా ఇంగ్లీష్ లో పెట్టడం వెనుక, విషయ సూచిక ను ఇంగ్లీష్ లోనే ఇవ్వడం వెనుక అర్తం, పరమార్థం ఏమిటో రచయిత దశరథ్ కే తెలియాలి.

సరే, అది అలా వుంచితే..కొన్ని కొన్ని చోట్ల ఈ పుస్తక రచనను చూస్తే మరీ కథారచనలో ఓ..న..మ దగ్గర నుంచి చెప్పాలనో..లేదా అవి కూడా తెలియని వారిని దృష్టిలో పెట్టుకుని రాసారానో అనిపిస్తుంది. కాస్త విషయం తెలిసిన వారికి ఇది సిల్లీగా అనిపిస్తుంది. కానీ అస్సలు ఏమీ తెలియని వారిని తలచుకుంటే అసరమేమో అనిపిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల విషయం వివరించడం కన్నా, సందేశం, ఉపదేశాలు డామినేట్ చేసాయి అని కూడా అనిపిస్తుంది. ఇదంతా తొలి అధ్యాయం సంగతి.

ముందుకు వెళ్లిన కొద్దీ పాఠాలు నేర్పాలన్న సిన్సియారిటీ కనిపిస్తుంది. కానీ మరీ కొన్ని చోట్ల థీసిస్ లాగనో, ఏ డాక్టరేట్ కోసమో రాసిన స్టయిల్ నో తొంగిచూస్తుంది. కథల గురించి ఐడియాలు, సృఙన చెప్పడం కోసం వాడుకున్న ఉదాహరణలు అవీ కలిసి అసలు కథ రాయడం నేర్పడం కన్నా, సక్సెస్ ఫుల్ సినిమాల వెనుక వున్న సక్సెస్ మంత్రలను రచయిత తన కోణంలో విశ్లేషించినట్లు అనిపిస్తుంది.

టోటల్ గా ఈ పుస్తకం కథ రచనలో కాస్తయినా ప్రవేశం వున్న వారి కోసం కాకుండా, కథ రచన ను చేపట్టాలి..కానీ ఎలాగో తెలియదు. అస్సలు ఓ..న.మ రాదు అనుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తయారుచేసినట్లు వుంది. కథ రచనలో కాస్తయినా ప్రవేశం, అభినవేశం వున్నవారు, లేదా కథ రచన సాగిస్తున్నవారు, ఇందులో తమకు పనికి వచ్చేది ఏమైనా వుంది అనుకుని చదవడం అంత అవసరం కాదు. ఎందుకంటే అలాంటి వారికి ఇదీ మరీ ఎల్కేజీ లెవెల్ లో అమెచ్యూర్ గా కనిపిస్తుంది.

అస్సలు కథ రాయడం గురించి తెలియని వారు మాత్రం ఒక్కో చాప్టర్ ఒకటికి పదిసార్లు చదివితే కాస్త బుర్రకు ఎక్కొచ్చు. అప్పుడు అటు దిశగా ప్రయత్నించవచ్చు.

దశరథ్ ఏమీ అనుకోరు అంటే ఒక మాట. దశరథ్ గురించి, తీసిన సినిమాల గురించి తెలిసిన వారు ఈ పుస్తకం చదివితే, ఇంత థియరీ, ఇంత విశ్లేషణ్ తెలిసిన ఆయన ఎందుకు సరైన, వైవిధ్యమైన, ప్రభావవంతమైన స్క్రిప్ట్ ను ఇటీవలి కాలంలో అస్సలు అదించలేకపోయారు అన్న అనుమానం వస్తుంది. వంటల పుస్తకం రాయడం వేరు. వంట చేయడం వేరు అన్న సమాధానం కూడా అప్పుడే తట్టినా ఆశ్చర్యం లేదు.