సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లాకు చెందిన కాస్ట్యూమ్ కృష్ణ.. 1954లో చెన్నై వెళ్లి అసిస్టెంట్ కాస్ట్యూమర్‌గా సినిమారంగంలో ప్రవేశించాడు. అతి తక్కువ కాలంలోనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పాటు వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్లకు కూడా ఆయన కాస్ట్యూమ్స్ అందించారు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్ళిపందిరి చిత్రాన్ని నిర్మించడంతో పాటు అందులో నటించారు. పెళ్లాం చెబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి సినిమాల్లో నటించారు.
కాస్ట్యూమ్స్ కృష్ణ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. అంతా బాగుందనుకున్న సమయంలో పెళ్లిపందిరి సినిమా రూపంలో కాస్ట్యూమ్స్ కృష్ణకి దెబ్బ తగిలింది. ఒకప్పుడు రాజులా బతికిన ఆయన కొంతమంది చేసిన మోసం కారణంగా చెన్నైలో ఓ అపార్ట్ మెంట్ లో సాధారణ జీవితం గడిపారు.