ఒకే ఒక జీవితం..గత వారం విడుదలై విజయవంతగా ముందుకు సాగుతోన్న సినిమా. హీరో శర్వానంద్ కు ఒకటి రెండు పరాజయాల తరువాత ఊరటనిచ్చిన సినిమా. ఇండస్ట్రీలో అందరి నుంచి మంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా కు దర్శకుడు శ్రీకార్తీక్. డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ రన్ సందర్భంగా శర్వానంద్ ‘గ్రేట్ ఆంధ్ర’తో మాట్లాడారు. ఆ వివరాలు
ఫుల్ హ్యాపీనా?
అన్ని వైపుల నుంచి ప్రశంసలు రావడంతో చాలా ఆనందంగా వుంది. ముఖ్యంగా క్రిటిక్స్ అందరికీ ఈ సినిమా నచ్చడం నాకు మరీ ఆనందాన్నిచ్చింది.
చెప్పిన స్క్రిప్ట్ ఇదేనా?
డే వన్ నాకు ఏదయితే కథ నెరేట్ చేసాడో అదే తీసాడు. చిన్న చిన్న ఇంప్రూవ్ మెంట్స్ తప్ప మార్పు అన్నది లేదు. నేను కూడా ఎక్కడా వేలు పెట్టలేదు. మంచి,చెడ్డ అన్నీ దర్శకుడికే చెందుతాయి. మేం అంతా అతను చెప్పినట్లు చేసాం అంతే.
కొత్త దర్శకుడు..కొత్త తరహా స్ట్రిప్ట్
దర్ళకుడిని నమ్మాం. అందుకే ఎక్కడా ఏ అనుమానం పెట్టుకోకుండా ముందుకు వెళ్లాం. ఇంటర్వెల్ బ్యాంగ్, సినిమాను లాక్ చేసిన పద్దతి అవన్నీ ముందు నుంచీ మాకు దర్శకుడి ఆలోచన మీద, స్టామినా మీద ఓ అంచనా ఏర్పరిచాయి. అందుకే ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా చేసాం.
భావోద్వేగాలు
నేను బాగా నటించానని మీరంతా అంటున్నా, పాత్రలో లీనమైపోయారని అంతా ప్రశంసిస్తున్నా అదంతా దర్శకుడి ప్రతిభనే. అతను మాతో చెప్పి చేయించుకున్నాడు. పెద్దగా టేక్ లు తీసుకోలేదు. రిహార్సల్స్ లేవు. అసలు అమ్మ అంటే ఆ ఎమోషన్ వచ్చేస్తుంది. సన్నివేశం వివరించి, ఎలా చేయాలి. ఏం అవుట్ పుట్ రావాలి అన్నది ముందుగా ఓ అరగంట డిస్కషన్ మాత్రం చేసే వాళ్లం. ఫలితం మీరు చూసిన అవుట్ పుట్. అందువల్ల క్రెడిట్ అంతా దర్శకుడిదే.
సంగీతం
సినిమాలో మంచి పాట ఒక్కటి వుంటే ఇంకా బాగుండేదని, ఓ మాంచి థీమ్ సాంగ్ వుండాల్సింది అని అందరూ అంటున్నారు. ఇక్కడ కూడా నా సమాధానం ఒక్కటే. దర్శకుడిదే క్రెడిట్ ప్లస్ అయినా మైనస్ అయినా.
మరికొంచెం టైమ్
సినిమా విడుదలకు మరికొంచెం టైమ్ దొరికితే బాగుండేది అనిపించింది.ఇంకా పబ్లిసిటీ చేసేందుకు అవకాశం వుండేది అనిపించింది. బ్రహ్మస్త్ర విడుదల ఎఫెక్ట్ వుందా? లేదా? అన్నది నాకు పెద్దగా తెలియదు.
తరువాత సినిమా..ఏమో?
మళ్లీ ఇదే నిర్మాత..దర్శకులతో సినిమా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నా. నాతో సినిమాలు అంటూ వచ్చిన వారికి కూడా ఇదే చెబుతున్నా..కొన్నాళ్లు ఈ విజయాన్ని ఆస్వాదించాలి. ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లాలి. అదే ఆలోచన ప్రస్తుతానికి.
విఎస్ఎన్ మూర్తి.