గతేడాది పూర్తిగా యాక్షన్ సినిమాలకు దూరమయ్యాడు నాగచైతన్య. అతడు చేసిన బంగార్రాజు మూవీ పల్లెటూరి మాస్ మూవీ. ఇక థ్యాంక్యూ సినిమా గురించి చెప్పనక్కర్లేదు. వీటితో పాటు హిందీలో ఓ సినిమా చేశాడు. ఇలా యాక్షన్ లుక్, ఫీల్ కు దూరమైన నాగచైతన్య… కొత్త ఏడాది తొలి రోజునే తన యాక్షన్ లుక్ ను బయటపెట్టాడు.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ సినిమాకు సంబంధించి న్యూ ఇయర్ కానుకగా గ్లింప్స్ రిలీజ్ చేశాడు. ఆ వీడియో చూస్తే సినిమాలో నాగచైతన్య ఔట్ అండ్ ఔట్ యాక్షన్ లో కనిపించబోతున్నాడనే విషయం అర్థమౌతుంది.
మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఏరియల్ షాట్స్ తో ప్రారంభమైన టీజర్, నాగచైతన్య యాక్షన్ తో ముగిసింది. ఈ గ్లింప్స్ తో సినిమా పూర్తిస్థాయి యాక్షన్ మూవీ అనే విషయాన్ని స్పష్టంచేశారు మేకర్స్. సినిమాలో చైతూ పోలీస్ గా కనిపించబోతున్నాడు.
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి యువన్ శంకర్ రాజా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రెండు కీలక పాత్రల్లో అరవింద్ స్వామి, ప్రియమణి కనిపించనున్నారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా మే 12న థియేటర్లలోకి రాబోతోంది కస్టడీ.