తను గర్భం దాల్చిన విషయాన్ని దీపిక పదుకోన్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో కల్కి సినిమా చేస్తున్న ఆమె, ఆ సినిమా షూటింగ్ పూర్తిచేసింది. ప్రెగ్నెన్సీ కారణంగా ఇక కల్కి ప్రచారానికి రాకపోవచ్చనే ప్రచారం జరిగింది. ఊహాగానాలకు చెక్ పెడుతూ, దీపిక పదుకోన్ కల్కి ప్రచారానికి వచ్చింది.
గర్భం దాల్చిన తర్వాత తొలిసారి బయటకొచ్చింది దీపిక. ముంబయిలో జరిగిన కల్కి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బేబీ బంప్ తో దీపిక కనిపించిన వెంటనే వందల కెమెరాలు క్లిక్ మన్నాయి. తొలిసారి ప్రెగ్నెన్సీ లుక్ లో దీపిక కనిపించిందంటూ బాలీవుడ్ మీడియా హోరెత్తించింది.
గర్భంతో దీపిక మెట్లు దిగబోతుంటే, ప్రభాస్ ముందుకెళ్లి ఆమెకు సాయం చేశాడు. చేయి పట్టుకొని జాగ్రత్తగా వేదిక నుంచి కిందకు దించాడు. అదే టైమ్ లో ఆమెకు సాయం చేసేందుకు అల్లంత దూరం నుంచి అమితాబ్ బచ్చన్ కూడా వడివడిగా వచ్చారు. అయితే అప్పటికే ప్రభాస్, దీపిక చేయి అందుకోవడంతో అంతా సరదాగా నవ్వుకున్నారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడ్డం కోసం మరోసారి దీపికను స్టేజ్ పైకి పిలిచారు. ఈసారి మాత్రం ప్రభాస్ కంటే ముందు ఉరికారు అమితాబ్. దీపిక చేయి పట్టుకొని జాగ్రత్తగా ఆమెను వేదికపైకి తీసుకొచ్చారు. ఈ సన్నివేశాలు రెండూ అందర్నీ బాగా ఆకట్టుకున్నాయి.