బాలీవుడ్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ఆది నుంచి కీలకంగా ఉన్న దీపిక పదుకోన్ టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ పరారైంది. 3 రోజుల నుంచి ఆమె ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులకు అందుబాటులోకి రాలేదు. ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
గతవారం ముంబయిలోని వెర్సోవాలో కరిష్మా ప్రకాష్ నివాసంలో ఎన్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో సీక్రెట్ గా దాచిన 1.7 గ్రాముల నిషేధిత మాదకద్రవ్యాల్ని కనుగొన్నారు. దాన్ని సీజ్ చేసిన అధికారులు.. విచారణకు హాజరుకావాల్సిందిగా అదే రోజు నోటీసులు ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచి కరిష్మా కనిపించడం లేదు.
చెప్పిన తేదీకి విచారణకు హాజరుకాకపోవడంతో కరిష్మా ఇంటికి మరోసారి నోటీసులిచ్చారు. అలా ఇప్పటివరకు 3సార్లు నోటీసులిచ్చిన అధికారులకు కరిష్మా జాడ కనిపించలేదు. ఆమె మొబైల్ స్విచాఫ్ లో ఉందని, మెయిల్ కు కూడా స్పందించడం లేదని ప్రకటించారు అధికారులు.
సుశాంత్ మరణానికి సంబంధించి డ్రగ్స్ కోణం వెలుగుచూసిన తర్వాత రియా చక్రబొర్తిని అరెస్ట్ చేశారు ఎన్సీబీ అధికారులు. అదే టైమ్ లో కరిష్మా ప్రకాష్ వాట్సాప్ ఛాట్స్ బయటపడ్డాయి. వాటి ఆధారంగా దీపిక, సారా, రకుల్, శ్రద్ధాకపూర్లను విచారించారు పోలీసులు. అవే వాట్సాప్ ఛాట్స్ ఆధారంగా కరిష్మాను ప్రశ్నించడంతో పాటు.. డ్రగ్స్ సరఫరా చేస్తున్న పలువుర్ని అరెస్ట్ చేయగలిగారు అధికారులు.
ఇలా అన్ని కోణాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న కరిష్మా ప్రకాష్ ఇప్పుడు కనిపించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు.. ఈ కేసుకు ప్రధాన అవరోధంగా కూడా మారింది.