సాకర్ ప్రపంచకప్ లో భారత ఫుట్ బాల్ జట్టుకు ఏ మాత్రం ప్రాతినిధ్యం లేకపోయినా.. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సమయంలో మాత్రం భారత సినీతారకు ఛాన్స్ దక్కుతోంది. ఫైనల్స్ కు ముందు కిక్కిరిసిన స్టేడియంలో ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించే ఛాన్స్ దీపికా పదుకోన్ కు దక్కింది. ప్రపంచకప్ ఫైనల్స్ కు ముందు దీపిక ట్రోఫీని ఆవిష్కరించనుంది. ఈ మేరకు ఆమె ఖతార్ కు పయనం అవుతోంది.
సాకర్ లో భారత్ కు తగు ప్రాతినిధ్యం లేదు. ప్రపంచకప్ లో పాల్గొన్న చరిత్ర లేదు. ఎప్పుడో 1950లలో భారత జట్టుకు ర్యాంకింగ్ ప్రకారం అవకాశం వచ్చిందట. అయితే భారత ప్లేయర్లకు కనీసం షూలను స్పాన్సర్ చేసే వాళ్లు లేక భారత జట్టు నాడు ప్రపంచకప్ లో పాల్గొన లేకపోయిందని అంటారు. ఆ తర్వాత ర్యాంకింగ్ ద్వారా లేదా క్వాలిఫయర్స్ ద్వారా ఎన్నడూ భారత్ ప్రపంచకప్ ఛాయలకు వెళ్లలేదు. ఆ మధ్య అండర్ 17 ఫిఫా ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. తద్వారా కాస్త ఫుట్ బాల్ ఫీవర్ అలా వచ్చి వెళ్లింది ఇండియాకు.
మరి ఫుట్ బాల్ లో ప్రాతినిధ్యం విషయంలో కానీ, అవగాహన విషయంలో కానీ చాలా దూరంలో ఉండే భారత్ కు సంబంధించి ఒక సినీ సెలబ్రిటీలకు ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించే అవకాశం దక్కడం అరుదైనదే! ఏ హాలీవుడ్ సెలబ్రిటీతోనో, పాప్ మ్యూజిక్ స్టార్ తోనో… ఇలాంటి గ్లామరస్ ఈవెంట్ ను నిర్వహించడం సంప్రదాయం కావొచ్చు. అయితే ఈ సారి ఆ అవకాశం ఒక బాలీవుడ్ తారకు దక్కడం విశేషం.
ఇది వరకూ పలు సార్లు అంతర్జాతీయ వేదికలపై దీపికకు ఇలాంటి అవకాశాలు లభించాయి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా జ్యూరీలో సభ్యురాలిగా వ్యవహరించింది దీపిక. ఇప్పుడు సాకర్ ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించబోతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.