రవితేజ-నక్కిన త్రినాధ్ కాంబినేషన్ లో తయారవుతున్న పీపుల్స్ మీడియా సినిమా ధమకా. రవితేజ డబుల్ రోల్ చేయడంతో పాటు ఈ మధ్య వదిలేసిన ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ జానర్ లో తయారవుతోందీ సినిమా. ఈ మధ్య కాలంలో సినిమాకు నిడివి అన్నది కీ పాయింట్ అయిపోయింది. మరీ భారీ సినిమాలు తప్పిస్తే రెగ్యులర్ సినిమాల నిడివి రెండు గంటలకు కాస్త అటు ఇటుగా తప్ప ఎక్కువ వుంటే జనం ఫోన్ లు చూసుకుంటున్నారు.
అందుకే ధమకా నిడివిని రెండు గంటల పది నిమిషాల లోపు వుండేలా చూసుకున్నారు. మొత్తం మీద నిడివి రెండు గంటల పది నిమషాలు దాటదని, తొలిసగం అంతా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో వుంటుందని, మలిసగం అంతా కథ మీద నడుస్తూనే ప్రేక్షకులను అలరించే పాటలు మిక్స్ అవుతాయని దర్శకుడు నక్కిన త్రినాధరావు తెలిపారు. ధమకా సినిమా విడుదల సందర్భంగా నక్కిన త్రినాధరావు ‘గ్రేట్ ఆంధ్ర’తో మాట్లాడారు. సినిమా బాగా వచ్చిందని, రవితేజ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ తో వుంటుందని అన్నారు.
సినిమాలకు సక్సెస్ ఫుల్ పార్ములా అయిన రాజు-పేద అన్న కాన్సెప్ట్ తోనే ఈ సినిమా కూడా వుంటుందని, అయితే అది కేవలం థ్రెడ్ మాత్రమే అని, దాంతో అల్లుకున్న కథ కొత్తగా వుంటుందని అన్నారు. తను..తన రచయిత బెజవాడ కలిసి రెండు గంటల పాటు ప్రేక్షకులను జస్ట్ ఎంటర్ టైన్ చేయడమే కాన్సెప్ట్ గా పెట్టుకున్నామని చెప్పారు. సరైన స్క్రిప్ట్ కోసమే గ్యాప్ వచ్చిందని ఇప్పటికి మంచి స్క్రిప్ట్ సెట్ అయిందన్నారు. రవితేజ ను దృష్టిలో వుంచుకుని ఎంటర్ టైన్ మెంట్ కు లైట్ యాక్షన్ ను జోడించి కథ తయారు చేసామన్నారు. ఆయన ఎనర్జీ అంతా కనిపిస్తుందన్నారు.
కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాకుండా రెండు తండ్రి పాత్రలతో చిన్న ఎమోషన్ టచ్ కూడా ఇచ్చామని అది కూడా సినిమాకు ప్లస్ అవుతుందన్నారు. పెళ్లి సందడి విడుదలకు ముందే శ్రీలీల గురించి విని, చూసి ఫస్ట్ చాయిస్ లో డిసైడ్ అయిపోయామన్నారు.