సిద్ధార్థ ‘పుష్ప’ కలెక్షన్స్ నే వెక్కిరించాడా?

ఈ రోజు సిద్ధార్థ చేసిన ఒక ట్వీట్ చర్చకు దారి తీసింది.  Advertisement సిద్ధార్థ ఇంగ్లీషులో పెట్టిన ట్వీట్ ని తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేస్తే ఇది:- “దొంగ కలెక్షన్స్ చూపించడానికి కమీషన్ ఎంతో? రేట్…

ఈ రోజు సిద్ధార్థ చేసిన ఒక ట్వీట్ చర్చకు దారి తీసింది. 

సిద్ధార్థ ఇంగ్లీషులో పెట్టిన ట్వీట్ ని తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేస్తే ఇది:- “దొంగ కలెక్షన్స్ చూపించడానికి కమీషన్ ఎంతో? రేట్ ఎంత ఫిక్స్ చేసారో? ఎప్పటి నుంచో నిర్మాతలు వసూళ్ల విషయంలో నిజాలు చెప్పట్లేదు. ఇప్పుడు మీడియా కూడా ఆఫీషియల్ ఫిగర్స్ అంటూ దొంగ లెక్కలు చెప్పడానికి బయలుదేరింది….అన్ని భాషల్లోనూ, అన్ని సినీరంగాల్లోనూ ఇదే పరిస్థితి..అంతా ప్యాన్ ఇండియా మోసం”. 

అన్ని సినీరంగాలూ అని అన్నా కూడా సరిగ్గా దేశంలో ఐదు భాషల్లో “పుష్ప” ఆడుతున్న సమయంలో ఈ ట్వీట్ పెట్టడమంటే నేరుగా ఆ సినిమాని దెప్పి పొడుస్తున్నట్టే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 

ఆ అభిప్రాయాన్ని అలా ఉంచి ఈ విషయంలో కొన్ని వాస్తవాలు మాట్లాడుతుందాం. 

అసలు “ప్యాన్ ఇండియా సినిమా” అని దేనిని అనాలి? ఒక సినిమాని ఐదు భాషల్లో తర్జుమా చేసేస్తే పాన్ ఇండియా ఫిల్మ్ అయిపోతుందా? కథాబలం, స్థాయి, నేపథ్యం..దేశమంతా ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడం ఇలా ఎన్నో ఉంటాయి. ఉదాహరణకి చెప్పాలంటే బాహుబలి, దంగల్ లాగ అన్నమాట. 

“రంగస్థలం” చూసి అలాంటి సినిమాని అల్లు అర్జున్ ని పెట్టి తీయాలన్నది ఆలోచన. “నార్కోస్” టైపులో ఒక క్రిమినల్ కథని తీయాలనుకున్నారు. లోకల్ గా శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. అలా “పుష్ప” కథ తయారైంది. ఈ గొడవ ఒక్క ఆంధ్ర ప్రాంతానికి తప్ప దేశం మొత్తానికి పెద్దగా కనెక్ట్ ఉన్నది కాదు. 

బాహుబలి, దంగల్ అలా ఒక ప్రాంతానికే పరిమితమైపోయే కథలు కాదు. ఒకటి కాల్పనిక జానపద చిత్రం, రెండోది భావోద్వేగభరితమైన కుస్తీ వీరుడి కథ. అందుకే దేశమంతా మాట్లాడుకున్నారు. జానపద చిత్రం భారతదేశంలో అన్ని భాషల్లోనూ మారుమ్రోగింది. ప్రధాని మోదీ కూడా ఒక స్పీచులో “కట్టప్పా నే బాహుబలి కో క్యోన్ మారా?” అంటూ సరదాగా కోట్ చేసారు. అదీ ప్యాన్ ఇండియా అంటే. కానీ ఇదే సినిమా చైనాలో ఆడలేకపోయింది. కారణం ఆ కథలో భారతీయత ఉంది తప్ప యూనివర్సల్ అప్పీల్ లేదు. 

కానీ ఆ అప్పీల్ దంగల్ లో ఉండడంతో అది చైనాలో కూడా అద్భుతంగా వసూళ్లు రాబట్టింది. కనుక దంగల్ ని ప్యాన్ ఇండియా స్థాయి దాటిన సినిమా అని చెప్పొచ్చు. 

రాజమౌళి “ఆర్.ఆర్.ఆర్” కూడా ఒక రకంగా ప్యాన్ ఇండియా చిత్రం కాదు. ఎంత స్వాతంత్రోద్యమం నాటి కథ అయినా అది జరుగుతున్నది తెలుగు నేల మీదని చెప్పేసారు. అల్లూరి, కొమరం భీం అంటూ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే పాత్రల్ని పెట్టారు. కనుక రిలీజ్ కి ముందు “బాహుబలి” గురించి చర్చించుకున్నంతగా “ఆర్.ఆర్.ఆర్” గురించి చర్చ లేదు. కేవలం రాజమౌళి సినిమా కాబట్టి తక్కువగా చూడట్లేదంతే. ఆసక్తి మాత్రం పెంచుకోవట్లేదు. అద్భుతంగా ఉందని టాక్ వస్తే తప్ప ఆ సినిమాకి పెట్టిన ఖర్చు వసూళ్ల రూపంలో వెనక్కి రావడం కష్టం. 

ఇప్పుడు వసూళ్ల విషయానికొద్దాం. అసలు తెలుగు సినీ రంగంలో ఏం జరుగుతోందో చూద్దాం. 

ప్రతి సినిమాకి హీరో గారి పేమెంట్ పెరిగి తీరాలి. ఇది ప్రాధమికమైన రూల్. హిట్ తీస్తే డైరక్టర్ రెమ్యునరేషన్ కూడా పెరగాల్సిందే. ఇది మరొక రూల్. అంతే తప్ప ఎంత హిట్టైనా, ఎంత కలెక్షనొచ్చిందని చెప్పినా సదరు సినిమాకి పని చేసిన మరే ఇతర సాంకేతిక నిపుణుడికి, కార్మికుడికి పేమెంట్ పెరగదు. 

అంటే “రిచ్ బికం రిచర్. పూర్ బికం పూరర్” అన్నమాట. అలా కాకుండా ఏ సినిమాకి అధిక కలెక్షన్స్ వచ్చినా బోనస్ రూపంలోనో, భారీ నజరానాల రూపంలోనో ప్రతి టెక్నీషియన్ కి ఎంతో కొంత ఇస్తే అది నిజంగా ఆదర్శవంతమైన రంగం అనిపించుకుంటుంది. 

చాలా ప్రైవేట్ కంపెనీల్లో ఈ పద్ధతి ఉంటుంది. ఎమ్మెన్సీల్లో అయితే చెప్పక్కర్లేదు. ఏ ఆర్గనైజ్డ్ వ్యవస్థలోనైనా ఇంతే. కొన్ని కంపెనీల్లో మధ్యతరగతి ఉద్యోగులకి ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం, వాళ్ల పిల్లలకి చదువు చెప్పించడం, ఆసుపత్రి పాలైతే ఖర్చులు భరించడం లాంటివి కూడా చేస్తుంటారు. దీనిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లెక్కలో చూపించుకుంటారు. 

అలాంటివి కోట్లు గడించాయని చెబుతున్న సినిమాల ద్వారా జరుగుతున్నాయా? ప్రతి సినీ కార్మికుడికి ధైర్యంగా బ్రతకడానికి భరోసా కలిపిస్తున్నాయా ఆ హిట్ సినిమాలు? 

సినిమా అనేది సమిష్టి కృషి. 24 విభాగాల ప్రతిభ హీరో ద్వారా బయటికొస్తుంది. అంతే తప్ప తెర మీద కనిపించే హీరోదే ప్రతిభంతా కాదు కదా.  

ప్రతి కాఫ్ట్ కి ఒక సంఘం ఉంది..దాని ద్వారా సేవలు జరుగుతున్నాయని చెప్తారేమో బడా హీరోలు. ఆ సంస్థల్లో చేరడానికి భారీగా డబ్బు కట్టాలి. 

“మా అసోషియేషన్” ఒక్కటే జనానికి తెలుసు. ఆ విధంగా డబ్బింగ్ ఆర్టిస్టులకి, ఫైటర్స్ కి , డ్యాన్స్ మాస్టర్స్ కి, జూనియర్ ఆర్టిస్టులకి ఇలా అందరికీ సంఘాలున్నాయి. అందరూ అందులో డబ్బు కట్టి చేరినవారే. అలా కట్టిన డబ్బు మీద వచ్చే వడ్డీతో అవి నడుస్తున్నాయి తప్ప శ్రమ దోపిడీతో కోట్లకి పడగలెత్తిన హీరోల ఔదార్యంతో మాత్రం కాదు. 

అందుకే టికెట్ ధరలు కోత పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమ్మీద హీరోలు ఏడుస్తున్నారు తప్ప లైట్ మెన్లో, ఫైటర్లో, రచయితలో ఏడవట్లేదు. ఎందుకంటే హీరోకి ఎంతొచ్చినా వాళ్ళకి అందేది కూలి డబ్బులే. అధికంగా ఏదీ రాదు. ఆఖరికి నిర్మాత కూడా కూలీయే. కాకపోతే అందరికంటే దిగువనున్న కూలీ. అతనికి లాభాల్లో వాట హీరో కంటే తక్కువ. నష్టంలో మాత్రం 100% తనదే. కనుక ఇక్కడ అందరికంటే పెద్ద బాధితుడు నిర్మాతే.  

పెద్ద హీరోలు ఇప్పుడు బడా దళారీల్లా మారారు. హైప్ చేయడం…కోట్ల రెమ్యునరేషన్ నిర్మాత నుంచి గుంజడం, అధిక టికెట్ ధరలతో జనం నుంచి గుంజడం..అందులో కూడా వాటా పుచ్చుకోవడం..ఇదీ పరిస్థితి. 

అందుకే ఆంధ్ర ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించి హీరోల దురాశని అణిచే పని చేస్తున్నందుకు తాము సంతోషంగా ఉన్నామని కొందరు సినీ మిత్రులు నాతో చెప్పారు.  

ఇలా కాకుండా ఇస్తున్న జీతంతో పాటు ప్రతి టెక్నీషియన్ కి సినిమా హిట్టయ్యి లాభాలొస్తే ఇంత శాతం ఇస్తామని అందరికీ తక్కువ మొత్తంలో షేర్లు కేటాయించినా, లేదా లాభాలొస్తే నజరానాలిస్తామన్నా యావత్ సినీ ప్రపంచం హీరోల వెంట నిలబడుతుంది. అప్పుడు నిజమైన లెక్కలు మాత్రమే ప్రకటించాల్సిన అవసరం ఏర్పడుతుంది. 

ప్రతి దాన్ని మసి పూసి మారేడు చేసి కేవలం హీరోల రెమ్యునరేషన్లు బలవంతంగా పెంచుకునే దొంగ లెక్కలు కాకుండా అందరికీ పంచాల్సొస్తుంది కాబట్టి పారదర్శకంగా లెక్కలు చెప్పాల్సిన పద్ధతిని ప్రవేశపెట్టాల్సొస్తుంది. 

ప్రభుత్వం టికెట్ ధరల తగ్గుదల వల్ల సామాన్యుడికి చేసే మేలు ఏమో గానీ..సినీరంగంలో ఈ “షేరింగ్” పద్ధతి ప్రవేశ పెడితే ఈ రంగాన్ని నమ్ముకున్న దిగువస్థాయి కార్మికుడికి కూడా మేలు చేసినట్టవుతుఇంది. 

ఈ దిశగా ప్రభుత్వం ఏదైనా చేయగలేదేమో తెలియదు. ఈ మార్పుని పెద్ద హీరోలే ప్రవేశ పెడితే టికెట్ ధరల తగ్గుదలని అడ్డుకోవడానికి హీరోల వెనుక 24 క్రాఫ్ట్స్ వాళ్లూ తోడవుతారు. 

– శ్రీనివాసమూర్తి