ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకౌంట్లో ఉండిన డబ్బు గురించి భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు బిహార్ పోలీసులు ఈ విషయంలో ఒక వాదన వినిపిస్తూ ఉండగా, మహారాష్ట్ర పోలీసులు మరో మాట చెబుతున్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. సుశాంత్ మరణ వార్త వచ్చినప్పుడు ఈ డబ్బు గొడవ పెద్దగా లేదు. అప్పుడు సుశాంత్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు సుశాంత్ అకౌంట్లో భారీగా డబ్బు ఉండేదని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు.
అంతకు మించి సంచలనం ఏమిటంటే.. ఆ డబ్బు భారీ ఎత్తున నటి రియా చక్రబర్తి అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ అయ్యిందని సుశాంత్ కుటుంబీకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంలో పలువురు స్పందిస్తూ రియా విలన్ అని తేలుస్తున్నారు. ఆమె అతడి డబ్బుతో పార్టీలు చేసుకునేదని మొదలుపెట్టి, సుశాంత్ కు ఆమె డ్రగ్స్ ఇచ్చిందనే వాదన కూడా వినిపిస్తున్నారు. సుశాంత్ ను కలవకుండా రియా తమకు అడ్డుపడేదని సుశాంత్ ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారట! అయితే ఇలాంటి వారెవరూ సుశాంత్ ఆత్మహత్య వెంటనే ఈ తరహాలో స్పందించలేదు. మరొకరు స్పందిస్తూ సుశాంత్ మరణంపై రియాకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇవ్వాలని సుశాంత్ కుటుంబీకులు తన పై ఒత్తిడి చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించి దుమారం రేపాడు.
ఈ సంగతలా ఉంటే.. బిహార్ పోలీసులు డబ్బు నంబర్ ను అమాంతం పెంచుతూ ఉన్నారు. సుశాంత్ అకౌంట్లో 15 కోట్ల రూపాయల డబ్బు ఉండేదని, అందులో భారీ మొత్తాన్ని రియా కుటుంబీకులు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారని సుశాంత్ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారట. అయితే తాజాగా బిహార్ పోలీసులు 50 కోట్ల వరకూ డబ్బు అని అంటున్నారు! గత నాలుగేళ్లలో సుశాంత్ అకౌంట్ లోకి 50 కోట్ల రూపాయల డబ్బు జమ అయ్యిందని, అందులో గత ఏడాది కాలంలో ఎక్కువ మొత్తం విత్ డ్రా అయ్యిందని బిహార్ డీజీపీనే వ్యాఖ్యానించడం గమనార్హం.
అయితే ముంబై పోలీసులు మాత్రం సుశాంత్ అకౌంట్లో ఏడాది కిందట 18 కోట్ల రూపాయల వరకూ ఉండేదని, అందులో ఇప్పటికీ 4.5 కోట్ల రూపాయలు అలాగే ఉందని అంటున్నారు. సుశాంత్ అకౌంట్ నుంచి రియాకు సంబంధించిన ఖాతాల్లోకి భారీగా డబ్బు ట్రాన్స్ ఫర్ అయినట్టు ఇప్పటి వరకూ తమ విచారణలో తేలలేదని, మరింత కూలంకషమైన విచారణ చేయబోతున్నట్టుగా ముంబై పోలీసులు ప్రకటించారు.