ప్రస్తుత పవన్ కల్యాణ్ హీరోగా పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా అనుమానాలున్నాయి. కొందరు మే నెలలో వస్తుందంటే.. మరికొందరు దసరాకు వస్తుందంటూ గాసిప్స్ అల్లడం స్టార్ట్ చేశారు. ఎట్టకేలకు దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.
పింక్ రీమేక్ ను మే 15న విడుదల చేస్తామని ప్రకటించాడు దిల్ రాజు. జాను సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ బడా ప్రొడ్యూసర్.. ఆ తేదీని దృష్టిలో పెట్టుకొని వర్క్ అంతా పూర్తిచేస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు.. సినిమా టైటిల్ పై వస్తున్న కథనాల్ని కూడా కొట్టిపారేశాడు.
ఈ సినిమాకు లాయర్ సాబ్, నంబర్ వన్ లాయర్ అంటూ రకరకాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవేవీ తమ సినిమా టైటిల్ కాదని అంటున్నాడు దిల్ రాజు. పింక్ రీమేక్ కు ఏ టైటిల్ పెట్టామో తెలియాలంటే ఉగాది వరకు ఆగాల్సిందే. ఎందుకంటే.. ఉగాది రోజున ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు దిల్ రాజు.
ఇప్పటికే హిందీ, తమిళ్ లో వచ్చేసింది పింక్ సినిమా. మరి తెలుగులో కూడా మక్కికిమక్కి తీస్తున్నారా అనే ప్రశ్నకు తల అడ్డంగా ఊపాడు దిల్ రాజు. ఆల్రెడీ 2 భాషల్లో జనాలు చూసేసిన తర్వాత కాస్త కొత్తగా ఏదైనా చెప్పాలి కదా అంటూ ఫీలర్ వదిలాడు. రాజుగారి మాటలు వింటుంటే.. పింక్ రీమేక్ కు భారీ మార్పులే జరిగినట్టున్నాయి.