రిలీజైన మొదటి రోజు మొదటి ఆటకే ఫ్లాప్ అయింది శాకుంతలం సినిమా. సమంత లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై, ఆ అంచనాల్ని అందుకోవడంలో తీవ్రంగా విఫలమైంది. ఈ పరాజయంపై తనదైన శైలిలో స్పందించింది సమంత. “పని చేయడం వరకే మన వంతు, ఫలితం మన చేతిలో ఉండదు” అనే అర్థం వచ్చేలా భగవద్గీత శ్లోకాన్ని కోట్ చేసింది.
అయితే ఇలా నర్మగర్భంగా మాట్లాడ్డం దిల్ రాజుకు చేతకాదు. ఏదైనా ఉన్నదున్నట్టు మాట్లాడ్డమే ఈ నిర్మాతకు తెలుసు. శాకుంతలం రిజల్ట్ పై కూడా అలానే స్పందించాడు రాజు. తన పాతికేళ్ల కెరీర్ లోనే శాకుంతలం సినిమాను అతిపెద్ద లాస్ గా అభివర్ణించాడు.
“సగటు ఆడియన్స్ ను అన్ని థియేటర్లకు పంపించి రివ్యూస్ తెప్పించేశాం. అప్పటికే మాకు విషయం అర్థమైపోయింది. ఇక సోమవారం, మంగళవారానికి కలెక్షన్లు లేవంటే రిజల్ట్ ఏంటనేది గ్రహించాలి. అప్పటికీ ఇంకా భ్రమల్లో ఉండకూడదు. నా 25 ఏళ్ల కెరీర్ లోనే అతిపెద్ద జర్క్ ఇచ్చింది శాకుంతలం.”
ఇలా శాకుంతలం సినిమాపై ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేశాడు దిల్ రాజు. గుణశేఖర్ తో కలిసి ఈ సినిమాను నిర్మించిన రాజు, సమంతపై, గుణశేఖర్ పై ఉన్న నమ్మకంతో భారీగా పెట్టుబడి పెట్టాడు. తాజా సమాచారం ప్రకారం, పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వచ్చినట్టు లేదు. ఇద్దరు నిర్మాతల్లో ఎవరికి ఎంత నష్టం వచ్చిందనేది వాళ్లకే తెలియాలి. ఆ అంకెలు ఇప్పట్లో బయటకు రావు.