చాన్నాళ్ల తర్వాత దిల్ రాజు మనసువిప్పి మాట్లాడాడు. తన సినీరంగ ప్రవేశం 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్సాహంగా కనిపించిన దిల్ రాజు, గ్రేట్ ఆంధ్రతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ ఎంట్రీతో పాటు.. తనపై ఉన్న పలు అపోహలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
“బాలీవుడ్ వెళ్లాలని ఎప్పట్నుంచో ఉంది. కాకపోతే మంచి కంటెంట్ దొరకలేదు. ఏ భాషలోనైనా సక్సెస్ కొట్టాలంటే మంచి స్టోరీ కావాలి. ఈ వయసులో వేరే ఫీల్డ్ లోకి వెళ్లి రిస్క్ చేయలేను కదా. నా ఫీల్డ్ లోనే నేను విస్తరించాలి. అందుకే బాలీవుడ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. డబ్బు నాకు ముఖ్యం కాదు. నా లైఫ్ స్టయిల్ చాలా సింపుల్. నాకు సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ తో నలుగురికి మంచి జరగాలి.”
వచ్చేనెలలో ముంబయిలో ఆఫీస్ తెరుస్తానని ప్రకటించిన దిల్ రాజు, ఎవడు, ఎఫ్-2, జెర్సీ స్క్రిప్ట్ లపై వర్క్ జరుగుతున్నట్టు స్పష్టంచేశాడు. నిఖిల్ అద్వానీతో ఎవడు, బోనీకపూర్ తో ఎఫ్2, అల్లు అరవింద్ తో జెర్సీ రీమేక్స్ ఉంటాయని తెలిపాడు. ఈ సందర్భంగా తనపై ఉన్న అపోహపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రిలీజ్ డేట్స్ ను తను ఫిక్స్ చేయనని చెబుతున్నాడు.
“దిల్ రాజు రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తాడనేది ఫాల్స్. నాతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. నా హ్యాండ్ లేకపోతే థియేటర్లు దొరకవనేది కూడా తప్పు. తిప్పికొడితే నాకు 30 థియేటర్లు కూడా లేవు. ఇదంతా ఓ భ్రమ అంతే. కాకపోతే ఏంటంటే హీరోలంతా నాతో క్లోజ్ గా ఉంటారు. అన్ని విషయాలు మాట్లాడతారు. ఏవైనా రిలీజ్ లు ఉంటే నాకు వాటితో సంబంధం లేకున్నా క్లాష్ అవ్వకుండా సలహా ఇస్తాను.”
నితిన్, రాజ్ తరుణ్ పై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా దిల్ రాజు స్పందించాడు. తను నెగెటివ్ గా స్పందించలేదని, ఆ విషయాన్ని హీరోలు కూడా అర్థం చేసుకున్నారని అంటున్నారు. అయినా తను సోషల్ మీడియాను చూడడం మానేశానని, పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
“నేను సోషల్ మీడియా చూడడం మానేశాను. ఓ మాట నా మనసులోంచి వస్తుందంటే అది పాజిటివ్ గానే వస్తుంది. దాన్ని చూసే వ్యక్తులు నెగెటివ్ గా చూస్తున్నారు. నితిన్, రాజ్ తరుణ్ గురించి నేను అన్న మాటల్ని విడదీసి చూశారు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వాళ్లతో సినిమాలు కూడా చేస్తున్నాను. వాళ్లకు నేనేంటో తెలుసు. ఇవేం పట్టించుకోరు వాళ్లు.”
హీరోల భారీ రెమ్యూనరేషన్ పై కూడా దిల్ రాజు స్పందించాడు. పారితోషికాలు కంట్రోల్ చేయడం ఎవ్వరితరం కాదంటున్నాడు. హీరోల మైండ్ సెట్ లోనే మార్పు రావాలని, బ్లాక్ బస్టర్ వచ్చినా డబ్బులు రానప్పుడు హీరోలు ఆటోమేటిగ్గా ఆలోచిస్తారని, అప్పుడు రెమ్యూనరేషన్ సిస్టమ్ లో మార్పులు వస్తాయని అన్నాడు.