మా సినిమా హిట్ అంటే, కాదు మా సినిమా ఇంకా పెద్ద హిట్ అంటూ వరుసగా పోస్టర్లు విడుదల చేసుకుంటున్నారు. ఒకరు 200 కోట్లతో పోస్టర్ వేస్తే, మరొకరు 220 కోట్ల గ్రాస్ అంటూ పోస్టర్లు వదులుతున్నారు. ఇలాంటి టైమ్ లో మీడియా ముందుకొచ్చింది సరిలేరు నీకెవ్వరు యూనిట్. దీంతో సహజంగానే వసూళ్లపై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఎవ్వరూ స్పందించలేదు.
ఈరోజు దిల్ రాజు, అనీల్ సుంకర, అనీల్ రావిపూడి మీడియాతో మాట్లాడారు. తమ సినిమా హిట్ చేసినందుకు ప్రేక్షకులకు మరోసారి థ్యాంక్స్ చెప్పారు. కానీ వసూళ్లు ప్రస్థావన వచ్చినప్పుడు మాత్రం విషయాన్ని పక్కదారి పట్టించారు. ప్రస్తుతం పరిస్థితి చాలా సెన్సిటివ్ గా ఉందని, వసూళ్ల గురించి మాత్రం అడగొద్దని మీడియాను రిక్వెస్ట్ చేశారు. అనీల్ సుంకర మాత్రం ఓ అడుగు ముందుకేసి, సినిమా ఇంకా థియేటర్లలో ఉందని.. మరో వారం పోయిన తర్వాత పూర్తి ఫిగర్ బయటపెడతామని ప్రకటించాడు. అటు దిల్ రాజు, అనీల్ రావిపూడి మాత్రం నవ్వుతూ పక్కకు తప్పుకున్నారు.
సరిలేరు నీకెవ్వరు సినిమా థియేటర్లలోకొచ్చి 2వారం అవుతున్నప్పటికీ, సినిమా ప్రచారం ఆపడానికి ఇష్టంపడడం లేదు మేకర్స్. ఇలా ఏదో ఒక రూపంలో మీడియా ముందుకొస్తున్నారు. అంతేకాదు.. ఈ వీకెండ్ నుంచి అదనంగా ఓ కామెడీ సీన్ కూడా యాడ్ చేయబోతున్నామని ప్రకటించారు. రావురమేష్ ఫ్యామిలీ, మహేష్ మధ్య వచ్చే ఒకటిన్నర
నిమిషం నిడివి సీన్ ను జతచేయబోతున్నామని చెప్పారు.
ఇక్కడితో ఆగకుండా మరో భారీ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తోంది యూనిట్. ప్రస్తుతం మహేష్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి, అతడు తిరిగొచ్చిన తర్వాత ఓ తేదీ ఫిక్స్ చేసి.. మరో పెద్ద కార్యక్రమం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్ మీట్ ఒకటి అయినప్పటికీ, ఫినిషింగ్ టచ్ గా ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నారు.