దర్శకుడు మారుతి నిజం ఒప్పుకున్నాడు. ఏది ఆశించి ప్రేక్షకులు తన సినిమాకు వచ్చారో అది అందించలేకపోయానని అంగీకరించాడు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుందని ఆడియన్స్ ఆశించారు. కానీ ఔట్ డేటెట్ కామెడీతో, అరకొర పంచ్ లతో సరిపుచ్చాడు మారుతి. ఈ విషయాన్ని సభాముఖంగా ప్రకటించాడు కూడా.
“పాపం ప్రేక్షకులు బాగా ఆశలు పెట్టుకున్నారు. నా సినిమా కాబట్టి ఫన్ ఎక్కువగా ఊహించుకున్నారు. నిజంగా అంత ఫన్ అందించలేకపోయాను. కొంత తగ్గిన మాట వాస్తవమే. కానీ సీరియస్ గా చెప్పాలనుకున్న పాయింట్ ను చెప్పాను. త్వరలోనే రాబోతున్న పక్కా కమర్షియల్ సినిమాలో 3-4 రెట్లు ఎక్కువ కామెడీ ఇస్తాను. ఇది నా హామీ.”
ఇలా మంచి రోజులు వచ్చాయి సినిమాలో కామెడీ తగ్గిన విషయాన్ని అంగీకరించాడు మారుతి. అయితే ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించాలని, అప్పుడు మాత్రమే పెద్ద దర్శకులు కూడా తమ ఇమేజ్ నుంచి బయటకొచ్చి, కాన్సెప్టు సినిమాలు చేస్తారని అన్నాడు మారుతి.
దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చింది ''మంచి రోజులు వచ్చాయి'' సినిమా. సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సక్సెస్ చేసేందుకు యూనిట్ అంతా థియేటర్ల చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర చుట్టేసింది.