గతంలో నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నప్పుడు టోటల్ గా అక్కినేని కుటుంబాల్లో విడాకుల వ్యవహారంపై పెద్ద చర్చ నడిచింది. అక్కినేని హీరోలకు పెళ్లిళ్లు కలిసిరావనే కోణంలో నాగార్జున, సుమంత్ లాంటి హీరోల పేర్లు తెరపైకొచ్చాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ వంతు వచ్చింది.
తాజాగా నిహారిక కొణెదల తన విడాకుల వ్యవహారాన్ని ప్రకటించింది. భర్త చైతన్య నుంచి విడిపోయినట్టు ఆమె నిర్థారించింది. దీంతో మెగా కాంపౌండ్ లో విడాకులపై చాలామంది దృష్టిపడింది. నిహారికతో కలిపి చూసుకుంటే, మెగా కాంపౌండ్ లో కూడా విడాకుల ఉదంతాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
మెగా కాంపౌండ్ లో విడాకులనగానే ఎవరికైనా ముందుగా పవన్ కల్యాణ్ పేరే గుర్తొస్తుంది. ఆయన ఇప్పటికే 2 సార్లు విడాకులిచ్చారు. జీవితంలో మొదటిసారి నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు పవన్. అయితే ఆ వైవాహిక బంధం ఎక్కువ రోజులు సాగలేదు. కొన్నాళ్లకే ఆమెకు విడాకులిచ్చారు.
ఆ తర్వాత నటి రేణు దేశాయ్ కు కనెక్ట్ అయ్యారు పవన్. బద్రి సినిమాతో కలిశారు వీళ్లిద్దరూ. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. 2009లో పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి టైమ్ కే వీళ్లకు అకిరా పుట్టాడు. పెళ్లి తర్వాత ఆద్య పుట్టింది. అంతా ఓకే అనుకున్న టైమ్ లో 2012లో పవన్-రేణు విడిపోయారు.
రేణు దేశాయ్ గత ఆరోపణల ప్రకారం, ఆమెతో వైవాహిక జీవితంలో ఉంటున్న టైమ్ లోనే రష్యా యువతి అన్నా లెజ్నావా అనే యువతికి కనెక్ట్ అయ్యారు పవన్. 2011లో తీన్ మార్ షూటింగ్ టైమ్ లోనే అన్నా-పవన్ కలిశారంట. 2013లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు పొలెనా అంజనా పవనోవా అనే అమ్మాయి, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే అబ్బాయి జన్మించారు.
రీసెంట్ గా తన మూడో భార్య అన్నాతో కూడా పవన్ దూరంగా ఉంటున్నట్టు వార్తలొచ్చాయి. అయితే వాటిని జనసేన పార్టీ ఖండించింది. ఇలా పవన్ వైవాహిక జీవితం, విడాకుల గురించి చాలా చెప్పుకోవచ్చు.
పవన్ కల్యాణ్ తర్వాత మెగా కాంపౌండ్ లో విడాకులతో పాపులర్ అయిన వ్యక్తి శ్రీజ. ఈమె చిరంజీవి కూతురు. చదువుకునే రోజుల్లోనే శిరీష్ భరధ్వాజ్ అనే కుర్రాడ్ని ప్రేమించింది. తండ్రి చిరంజీవిని ఎదిరించి మరీ అతడ్ని పెళ్లి చేసుకుంది. పాప కూడా పుట్టింది. అయితే వీళ్ల లవ్ లైఫ్ సాగినంత సాఫీగా, మ్యారీడ్ లైఫ్ సాగలేదు. చూస్తుండగానే ఇద్దరూ విడిపోయారు.
శిరీష్ భరధ్వాజ్ కు విడాకులిచ్చిన తర్వాత కల్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది శ్రీజ కొణెదల. ఈసారి పెద్దలు కుదిర్చిన సంబంధం ఇది. స్వయంగా చిరంజీవి దగ్గరుండి కూతురు పెళ్లి చేశారు. వీళ్లకు కూడా ఓ పాప పుట్టింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ బంధం కూడా ఎక్కువ రోజులు సాగలేదంటూ వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం శ్రీజ-కల్యాణ్ దేవ్ విడివిడిగా ఉంటున్నారని సమాచారం.
ఇప్పుడీ లిస్ట్ లోకి తాజాగా చేరిన మరో 'మెగా' వ్యక్తి నిహారిక కొణెదల. నాగబాబు కూతురీమె. మెగా కాంపౌండ్ లో యాక్టివ్ గా కనిపించే వ్యక్తి. నటిగా కొన్ని సినిమాలు కూడా చేయడంతో స్టార్ స్టేటస్ అందుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డను ఘనంగా వివాహమాడింది నిహారిక. ఆ తర్వాత ఇద్దరూ హైదరాబాద్ లో విడిగా కాపురం పెట్టారు. అయితే పెళ్లయిన మూడేళ్లకే వీళ్ల వైవాహిక బంధం బీటలువారింది. చైతన్య జొన్నలగడ్డతో తను విడాకులు తీసుకున్నట్టు తాజాగా నిహారిక ప్రకటించింది.
హీరోలు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తల్లిదండ్రులు కూడా విడిపోయారు. దాదాపు 15 ఏళ్ల కిందటే వీళ్లు విడిపోయారు. అప్పట్నుంచి పిల్లల్ని తల్లి విజయ దుర్గ పెంచి పెద్ద చేశారు. ఆ తర్వాత ఓ డాక్టర్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాల్ని ఓ ఇంటర్వ్యూలో సాయితేజ్ బయటపెట్టాడు కూడా. ఇలా మెగా కాంపౌండ్ లో కూడా అరడజను విడాకుల వ్యవహారాలున్నాయి.