మూడు వేలకు పైగా పాటలు రాసారు. గత పదేళ్లుగా పాటకి లక్షన్నర పైచిలుకు పారితోషకం అందుకున్నారు. గతంలో కూడా ఆయనే అందరికంటే ఎక్కువ పారితోషకం తీసుకున్న గీతరచయిత. సొంతిల్లు లేకుండా లేరు. హైదరాబాదులో రెండిళ్లున్నాయి. వాటిలో ఒకదాంట్లో నివాసముంటూ మరొక దానిని కార్యాలయంగా అనుభవించారు. అది కూడా శ్రీనగర్ కాలనీలో చాలామంది సెలబ్రిటీల ఇళ్ల నడుమ ప్రైం లొకేషన్ లో ఉన్నాయి ఆయన ఇళ్లు. సొంత కారు, డ్రైవరు సరేసరి.
అయినాకూడా ఈయన కుటుంబ ఆర్ధిక పరిస్థితిని గురించి వాకబు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసుపత్రి బిల్ కట్టడం అనే వార్త ఆశ్చర్యంగా ఉంది. ఏ మనిషైనా డబ్బు దాచుకునేది అత్యవసరానికే. ఆయన ఆసుపత్రి ఖర్చు కొన్ని లక్షల్లో ఉండొచ్చు. ఆ మాత్రం ఖర్చు భరించలేని స్థితిలో ఆయన కుటుంబం ఉందంటే ఆశ్చర్యమే. ఈ రోజుల్లో సామాన్యులకు కూడా లక్షల్లో ఆసుపత్రి బిల్లులు అలవాటైపోయాయి.
దాదాపు 35 ఏళ్లపాటు తెలుగు సినిమా పాట గౌరవాన్ని నిలబెడుతూ, చక్కని భావాలని అందమైన భాషలో అందిస్తూ, ఎందరో కవులకి స్ఫూర్తిగా నిలుస్తూ, ఇంకెందరికో బాధ్యతని కర్తవ్యాన్ని నూరిపోస్తూ ఆ క్రమంలో పద్మశ్రీ వంటి పురస్కారాలు అందుకుంటూ జీవితాన్ని గడిపిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఆసుపత్రి బిల్లును “గౌరవ సూచికంగా” కడుతున్నామని ప్రభుత్వం చెబితే బాగుండేది. అలా కాకుండా “ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని” బిల్లు కడుతున్నామన్న ప్రచారం బాధాకరం. అంతే కాదు ఇది సమాజంలో అనేక విమర్శలకు కూడా తావిస్తుంది. ఒకరకంగా శాస్త్రిగారి ఆర్ధిక పరిస్థితిని గురించి మాట్లాడడం ఇన్నేళ్ల ఆయన కృషికి అవమానకరం.
శాస్త్రిగారి కొడుకులిద్దరూ కోట్లు సంపాదించే వ్యక్తులు కాకపోయినా వారికంటూ స్వయం ప్రతిభలు ఉన్నాయి. పెద్ద కుమారుడు సంగీతజ్ఞుడైతే, రెండవ కుమారుడు నటుడు. ఇద్దరూ తమ పని తాము చేసుకుంటున్నారు. ఇంకా భవిష్యత్తు ఉంది.
వాళ్లిద్దరి సంగతి పక్కనబెడితే శాస్త్రిగారి సొంత సోదరుడి అల్లుడు త్రివిక్రం శ్రీనివాస్. శాస్త్రిగారితో కలిసి పని చేస్తున్న కుటుంబసభ్యుడు. ఒక్కో సినిమాకి రూ 20 కోట్లు పారితోషికం తీసుకుంటున్న దర్శకుడు. శాస్త్రి గారి గురించి ఒక సభలో పెద్ద స్పీచు దంచి, ఆయన కీర్తిపతాకాన్ని ఎగురవేసిన అత్యంత ఆత్మీయుడు. ఆయన తలచుకుంటే ఆసుపత్రి బిల్లుని సింగిల్ పేమెంటులో కట్టేయగలడు.
ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అనే మాటొచ్చినప్పుడు త్రివిక్రమైనా ఆపి ఉండాల్సింది. ఊరికే వస్తుంటే “ఊ!” కొట్టడం అనేది వెళ్లిపోయిన మహాకవిని అవమానించడమని ఆ మాటల మాంత్రికుడికి తెలియకపోవడం ఆశ్చర్యకరం.
ప్రభుత్వానికి ఆ మాహాకవిని గౌరవించాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ప్రాంగణానికి ఆయన పేరు పెడుతున్నామని ప్రకటించడమో, ఆయన పేరుతో ప్రతి ఏడు ఒక ఉత్తమ కవికి ప్రభుత్వం తరపున పురస్కారమిస్తామని చెప్పడమో చెయ్యాలి. అది ప్రభుత్వానికి, కవి కుటుంబానికి శోభస్కరంగ ఉండేది.
అంతేకానీ పేదవారికిచ్చినట్టు ఆసుపత్రి బిల్లు కడతామన్న ప్రతిపాదనే తప్పు. ఇక్కడ “ఆర్థిక పరిస్థితి” అనకుండా, “గౌరవ సూచకంగా” అని ఒక్క మాట వాడినా ఈ దోషం కొంతలో కొంత పోయుండేది.
కుటుంబ సభ్యులు కూడా, “ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. భగవంతుడి దయ వల్ల, స్వయం ప్రతిభ వల్ల మా తండ్రిగారు ఆర్థిక సాయాన్ని ఆశించనవసరం లేని స్థాయిలో నిష్క్రమించారు. మీ సాయాన్ని అర్హులైన పేదవారికి చేస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది” అని చెప్పుంటే కుటుంబ సభ్యుల గౌరవం కూడా మరింత పెరిగుండేది. మిగిలిన సినీ సమాజానికి కూడా వీరు మార్గదర్శకంగా ఉండేవారు.
ఇప్పుడు ఏ సినీసెలబ్రిటీ కాలం చేసినా ఆర్ధిక పరిస్థితితో సంబంధం లేకుండా ఆసుపత్రి బిల్లు ప్రభుత్వమే కడుతుందని ఆశించవచ్చు. అత్యధిక పారితోషకం తీసుకునే సీతారామశాస్త్రికే ఆర్ధిక సాయం అవసరమని ప్రభుత్వం ఆసుపత్రి బిల్లు కట్టింది కనుక ఒక రకంగా మిగతా పేరున్న రచయితలంతా అర్హులే అనే అర్థమొస్తోంది.
డబ్బు లేని కళాకారుడికైతే “ఆర్ధిక సాయంగా”, డబ్బున్న స్టారుకైతే “గౌరవ సూచికంగా” అందరికీ ఇస్తూ పోవాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఆసుపత్రిపాలైన సెలెబ్రిటీలు, వాళ్లు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు అలాగే ఆశించే అవకాశం లేకపోలేదు. ఇవ్వలేకపోతే పలు విమర్శలకు కూడా కేంద్రమవుతుంది.
ఇది చాలదన్నట్టు కుటుంబానికి ఏకంగా ఒక స్థలం కూడా కేటాయించమని ముఖ్యమంత్రి ఆదేశాలివ్వడం మరొక ఆశ్చర్యకరమైన విషయం.
అలా అనుకుంటే శాస్త్రిగారు పుట్టింది, కొన్నాళ్లు ఉద్యోగం చేసింది ఆ.ప్ర లో. ఆయన గీతరచయితయ్యాక జీవితమంతా చెన్నైలోనూ, హైదరాబాదులోనూ గడిపారు. తెలుగు సినీ కవిగా ఆయనకు తెలంగాణా ప్రాంతంలో కూడా అభిమానులున్నారు. ఇక్కడి ప్రజలు కూడా ఆయన పాటలతో చైతన్యం పొందారు. పైగా శాస్త్రిగారు మరణించే సమయానికి తెలంగాణా పౌరుడు.
పద్మశ్రీ అందుకున్నది కూడా తెలంగాణా రాష్ట్రవాసిగానే. కనుక ఆ.ప్ర ముఖ్యమంత్రి కంటే తెలంగాణా ముఖ్యమంత్రికే ఎక్కువ బాధ్యతుంది శాస్త్రిగారి విషయంలో. హైదరాబాదులో కూడా వీరి కుటుంబానికి స్థలాన్నివ్వమని తెలంగాణా ముఖ్యమంత్రిని అడగవచ్చేమో. ఒక్క ఆ.ప్ర ముఖ్యమంత్రే బాధ్యతంతా మోయడమెందుకు? కేసీయార్ కూడా ఒక చెయ్యి వేస్తే బాగుంటుంది.
ఈ వ్యాసం ఉద్దేశ్యం శాస్త్రిగారికి ప్రభుత్వ గౌరవం దక్కకూడదని కాదు. ఇప్పుడు దక్కింది గౌరవప్రదంగా లేదని మాత్రమే ఇక్కడ చెబుతున్నది.
– నరేష్ ఎన్