టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ఎర్లీ ప్రీమియర్స్. ఒకప్పుడు పెద్ద సినిమాలు, స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమాలకు మాత్రమే ఇలా ముందురోజు ప్రీమియర్స్ వేసేవారు. దాని కోసం ఫ్యాన్స్ ఎగబడేవారు. రాత్రిళ్లు నిద్రలు మానుకొని థియేటర్ల ముందు పడిగాపులు పడేవారు. టికెట్ కూడా వేలల్లో ఉండేది. అంతకంటే ముందు, కేవలం కొంతమంది ప్రముఖుల కోసం మాత్రమే ప్రీమియర్స్ వేసేవారు.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. తమ సినిమాను విడుదలకు ముందే ప్రేక్షకులకు చూపించడం స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో కొంతమంది సక్సెస్ అవ్వగా, మరికొంతమంది ఎదురుదెబ్బలు తిన్నారు.
నిజానికి ఈ ట్రెండ్ ప్రమోషన్ లో భాగంగా మొదలైంది. బలగం లాంటి సినిమాలకు కేవలం ప్రచారం కోసమే ఇలా ప్రీమియర్స్ వేశారు. విడుదలకు ముందే మంచి మౌత్ టాక్ జనరేట్ చేయగలిగారు. ఆ తర్వాత సినిమా రిజల్ట్ తెలిసిందే.
రీసెట్ గా సామజవరగమన అనే సినిమాకు కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. విడుదలకు ముందే ఎంపిక చేసిన ప్రాంతాల్లో, ప్రేక్షకులకు సినిమా చూపించారు. వీళ్లు కూడా సక్సెస్ అయ్యారు. దీంతో కొంతమంది దృష్టిలో ఇది సెంటిమెంట్ గా మారింది.
రిలీజ్ కు ముందు స్పెషల్ ప్రీమియర్స్ వేస్తే సినిమా సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ తో కొంతమంది.. కంటెంట్ పై నమ్మకంతో మరికొంతమంది.. తమ సినిమాల్ని ప్రీమియర్స్ గా వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాలకే పరిమితమైన ఈ ట్రెండ్, ఇప్పుడు మిగతా ప్రాంతాలకూ విస్తరించింది.
శుక్రవారం సినిమా రిలీజ్ పెట్టుకుంటే, గురువారం సాయంత్రానికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ప్రీమియర్స్ వేసేస్తున్నారు.
కొన్ని లాభాలు.. మరెన్నో నష్టాలు..
ఇలా విడుదలకు ముందే ఎంపిక చేసిన థియేటర్లు, లొకేషన్లలో ప్రీమియర్స్ వేయడం వల్ల కొన్ని లాభాలతో పాటు, నష్టాలు కూడా ఉన్నాయి. నిజంగా కంటెంట్ బాగుంటే.. మరుసటి రోజు రిలీజ్ టైమ్ కు ప్రేక్షకులు పోటెత్తుతారు. సామజవరగమన విషయంలో అదే జరిగింది. అదే ప్రీమియర్స్ లోనే టాక్ తేడా కొడితే రావాల్సిన ఓపెనింగ్స్ కూడా రావు. ఇంకా చెప్పాలంటే, సినిమా విడుదల కాకుండానే ఫ్లాప్ అవుతుందన్నమాట.
ఇక నిర్మాత పరంగా చూసుకుంటే, సినిమా హిట్-ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రీమియర్స్ వల్ల ప్రొడ్యూసర్ కు కొంత అదనపు ఆదాయం దక్కుతుంది. అయితే సినీ విశ్లేషకులు, కొంతమంది సినీ పెద్దలు మాత్రం ఈ ప్రీమియర్స్ సంస్కృతిని తప్పుపడుతున్నారు. ఇప్పటికే మొదటి రోజు మొదటి ఆటకే సినిమా రిజల్ట్ ఏంటనేది తెలిసిపోతోందని, ఓ సినిమా గట్టిగా వారం రోజులు థియేటర్లలో ఆడడం కష్టంగా మారిందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విడుదలకు ముందు రోజే ప్రీమియర్స్ వేయడం సరైన నిర్ణయం అనిపించుకోదంటున్నారు.
ఈ ట్రెండ్ వల్ల ఒకట్రెండు సినిమాలు లాభపడినప్పటికీ, మెజారిటీ మూవీస్ దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. ఎన్ని రోజులు ఈ ట్రెండ్ నడుస్తుందో చూడాలి.