Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ హీరోలు ఎక్కడ?

ఈ హీరోలు ఎక్కడ?

సినిమాలు సరైనవి దగ్గరకు రాకనో, వచ్చినా కథలు సెట్ కాకనో చాలా మంది హీరోలు ప్రాజెక్ట్ లు లేక అలా వుండిపోతున్నారు. పైగా టాలీవుడ్ మార్కెట్ పెద్ద గొప్పగా లేదు. పెద్దగా సినిమాలు తీస్తే రిస్క్ వున్నా, ఎంతో కొంత ఆదాయం కూడా వుంటోంది. అలా కాకుండా మిడ్ రేంజ్ సినిమాలు తీస్తుంటే విడుదలే కష్టం అవుతోంది. దీని వల్ల చాలా మంది హీరోలు చేతిలో సినిమాలు లేకుండా వుండిపోవాల్సి వస్తోంది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుశాంత్ ఇప్పుడేం చేస్తున్నారో తెలియదు. చాలా కాలంగా ఆయన పేరు వినిపించడం లేదు. మంచి ఒడ్డు, పొడవు, అందం వున్న నాగశౌర్య కూడా సైలంట్ గా వున్నారు. సరైన కథలు లేక ఏవీ ఓకె అనడం లేదని తెలుస్తోంది. మంచి నటుడు అనిపించుకుని, మంచి హీరోగా మారే ప్రయత్నం చేసాడు సత్యదేవ్. ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారో తెలియదు. అంత సైలంట్ గా వున్నాడు సత్యదేవ్.

ఆదికేశవ తరవాత కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు మెగా జూనియర్ హీరో వైష్ణవ్ తేజ్. ఏజెంట్ సినిమా తరువాత అక్కినేని అఖిల్ సినిమా ఒకటి యువి సంస్థతో వుందని వార్తలు మాత్రం వున్నాయి. కానీ దాని అతీ గతీ మాత్రం తెలియదు. బెల్లంకొండ చిన్న హీరో కూడా కథలు వింటున్నారు. ఇదిగో అదిగో సినిమా అంటున్నారు తప్ప, ఏదీ మెటీరియలైజ్ అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

నారా రోహిత్ ప్రతిధ్వని 2 అని ఓ సినిమా స్టార్ట్ చేసారు. కానీ ఇప్పుడు దాదాపు ఎన్నికల టైమ్ వచ్చేసినా ఆ సినిమా జాడ లేదు. మరో సినిమా చేస్తున్న దాఖలా లేదు. గీతా లాంటి అతి పెద్ద సంస్థ బ్యాకింగ్ వుండి కూడా అల్లు శిరీష్ ఎక్కడ వున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. సినిమా అయితే ఏదీ ప్లానింగ్ లో వున్నట్లు లేదు.

రాజ్ తరుణ్ ఓ మంచి హీరోగా చిన్న నిర్మాతలకు కలిసి వస్తాడని అనుకున్నారంతా. కానీ ఎక్కడో బెడిసికొడుతూంది. లాస్ట్ గా నా సామిరంగా సినిమా చేసారు. అది కాక ఏం చేస్తున్నారో అంటే, ఏవో చిన్న సినిమాలు అవుతున్నాయి అని వినిపిస్తోంది తప్ప, అంతకు మించి ఏమీ వినిపించడం లేదు. కనిపించడం లేదు.

కీరవాణి తనయుడు సర్రున దూసుకువచ్చి రెండు, మూడు సినిమాలు చేసారు. అంతే ఆ తరువాత మళ్లీ సైలంట్ అయిపోయారు. ఓ హిట్ తరువాత వచ్చిన ఓ డిజాస్టర్ టోటల్ గా పక్కన కూర్చో పెట్టేసింది అనుకోవాలేమో? ఇలా ఇంకా పలువురు హీరోలు కథలు సెట్ కావడం లేదనో, సరైన ప్రాజెక్ట్ లేదనో అలా వుండిపోయారు. కార్తికేయ గుమ్మకొండ మంచి సినిమాలు టేకప్ చేసారు. కానీ సరైన ఫలితాలు రాలేదు. దాంతో ప్రస్తుతం ఆయన మాత్రం నిర్మాతలు ఎవరో ఒకరు దొరుకుతారు. కానీ దర్శకులు, కథలు దొరకడం లేదు.

మొత్తం మీద చూస్తుంటే 2025 చివరకు టాలీవుడ్ నాన్ థియేటర్, థియేటర్ మార్కెట్ సెట్ కాకపోతే చాలా మంది హీరోలు తెరమరుగు అయిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?