సోషియో ఫాంటసీ సినిమాల్లో దేవుడు క్యారెక్టర్ ఒక్కోసారి వుంటూ వుంటుంది. గతంలో ఇలాంటి పాత్రల్లో పవన్ కళ్యాణ్, నాగార్జున, ఆఖరికి బ్రహ్మానందం కూడా కనిపించారు. ఇంకా వెనక్కు వెళ్తే ఇలాంటి పాత్రలు చాలా మంది చేసారు. ఈసారి విక్టరీ వెంకటేష్ వంతు వచ్చింది.
నిర్మాత పివిపి నిర్మిస్తున్న ఓరి దేవుడా సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. మలయళ సినిమా ఆధారంగా విష్వక్ సేన్, మిథిల పాల్కర్, ఆషా భట్ నటిస్తున్న సినిమా ఇది. అశ్వథ్ మరిముత్తు దర్శకుడు.
మలయాళ వెర్షన్ లోని ఈ కీలకపాత్రను తెలుగులో ఎవరు చేస్తారా? అని చాలా ఆసక్తి నెలకొంది. ఆఖరికి ఆ పాత్రను వెంకటేష్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ చిన్న విడియో బైట్ ను వదిలారు. వెంకటేష్ తన స్టయిల్ మానరిజమ్ తో ఈ విడియోలో కనిపించారు. అంతకు ముందు ప్రారంభంలో హీరో విష్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చారు.
షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది ఈ సినిమా. దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కాబోతోంది. నిర్మాత పివిపి బ్యానర్ తో పాటు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. ఈ సినిమాకు సంగీతం లియోన్ జేమ్స్. సంభాషణలు తరుణ్ భాస్కర్.