ఇకపై చకచకా సినిమాలు చేద్దాం అని ట్రయ్ చేస్తున్నా అని, మరో మూడు నెలల్లో ఇంకో సినిమా విడుదల వుంటుందని, ఈ ఏడాది కుదిరితే మూడు సినిమాలు విడుదల చేయాలని వుందని హీరో ప్రభాస్ అన్నారు.
రాధేశ్యామ్ ప్రమోషన్లలో భాగంగా ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ గ్యాప్ లో గ్రేట్ ఆంధ్రతో మాట్లాడారు. రాధేశ్యామ్ పబ్లిసిటీ, బజ్ ఎలా వుందని ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికే ఆదిపురుష్ పూర్తి చేసా అని, ప్రాజెక్ట్ కె కొంత వర్క్ చేసామని, ఈ ఏడాది ప్రాజెక్టు కే మరి కొంత వర్క్ చేసి, సలార్ కూడా పూర్తి చేస్తా అని అన్నారు.
కోవిడ్ వల్ల గతంలో ఏడాదికి రెండు సినిమాలు చేస్తా అని ఇచ్చిన మాట నెరవేరలేదన్నారు. పాన్ ఇండియా ఇమేఙ్ వచ్చిన తరువాత కథలు ఎంచుకోవడం కష్టంగా వుందని, వున్నంతలో కమర్షియల్ పాయింట్ తో సినిమాలు చేస్తున్నా అన్నారు.
అన్నీ కలిసి వస్తే జపాన్ వెళ్లి ఫ్యాన్స్ ను కలుస్తా అని ప్రభాస్ అన్నారు. జపాన్ వెళ్లి ఫ్యాన్స్ ను ఓసారి కలువు అని రాజమౌళి కూడా చెప్పారన్నారు. ఫ్రెండ్స్ వస్తే ఫుడ్ పెట్టడం అన్నది తనకు ఫ్యామిలీ నుంచే వచ్చిందని, అది తన ఫ్యామిలీ కల్చర్ అని, తన కన్నా తన నాన్న, పెదనాన్న అయితే ఇంకా మంచి హోస్ట్ లు అని ప్రభాస్ అన్నారు.
తన లైఫ్ లో బిగ్ బ్యాంగ్ అంటే బాహుబలే అని ప్రభాస్ అన్నారు. దాని వల్ల బాధ్యత బాగా పెరిగిందన్నారు. ఏ పని అయినా నేర్చుకుంటూనే వుండాలని తను అదే చేస్తున్నా అని ఆయన అన్నారు.