చిన్న ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌ని ప‌రిస్థితా?

జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఇది అవ‌మానం. ఒక‌టి కాదు, రెండు కాదు… ఏకంగా ఎనిమిది నెల‌లు జీతాలకు నోచుకోని ద‌య‌నీయ ప‌రిస్థితి వారిది. దీంతో విసిగి వేసారి పోయిన స‌చివాల‌య సిబ్బంది ఏపీ మంత్రి చెల్లుబోయిన…

జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఇది అవ‌మానం. ఒక‌టి కాదు, రెండు కాదు… ఏకంగా ఎనిమిది నెల‌లు జీతాలకు నోచుకోని ద‌య‌నీయ ప‌రిస్థితి వారిది. దీంతో విసిగి వేసారి పోయిన స‌చివాల‌య సిబ్బంది ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ చాంబ‌ర్‌కు తాళాలు వేశారు. జీతాల‌పై ఆధార‌ప‌డి జీవించే వేత‌న జీవుల‌కు ప్రతినెలా జీతాలు అందించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై వుంది. ఎందుకంటే వేత‌నాల‌పై ఉద్యోగుల కుటుంబాల్లోని అనేక మంది ఆధార‌ప‌డి బ‌తుకుతుంటారు.

పిల్ల‌ల చ‌దువు, కుటుంబ పోష‌ణ‌, ఇంటి అద్దెలు, వైద్య ఖ‌ర్చులు… ఇలా అనేక అంశాలు వేత‌నాల‌తో ముడిప‌డి వుంటాయి. ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఒకట్రెండు నెల‌లు ఉద్యోగులు జీతం లేకపోయినా నెట్టుకొచ్చే ప‌రిస్థితి వుంటుంది. అలా కాకుండా నెల‌ల త‌ర‌బ‌డి జీతాలు అంద‌కపోతే, వారంతా ఎలా బ‌తుకీడుస్తారో క‌నీస మాన‌వ‌త్వంతో ఆలోచించ‌క‌పోవ‌డం దారుణం.

మంత్రి వేణుగోపాల‌కృష్ణ‌ పేషీలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందికి 8 నెల‌లుగా జీతాలు అంద‌కపోవ‌డంతో స‌హాయ నిరాక‌ర‌ణ‌కు దిగారు. వీరంతా చిన్న‌చిన్న ఉద్యోగులు కావ‌డం గ‌మ‌నార్హం. వీరికి కాపు, బీసీ కార్పొరేషన్ల నుంచి జీతాలు అందేలా ఏర్పాట్లు చేశారు. కానీ జీతాలు మాత్రం అంద‌లేదు. 

త‌మ గోడును మంత్రితో పాటు ఉన్న‌తోద్యోగుల‌కు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో  మంత్రి చాంబర్‌కు తాళాలు వేశారు. కార్యాల‌యం వైపు ఉద్యోగులు క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డంతో ఈ వ్య‌వ‌హారం వైర‌ల్ అవుతోంది.