సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల రిలేషన్షిప్ గురించి విస్తృత ప్రచారం కావడం సర్వసాధారణమే. ఈ నేపథ్యంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందాతో రిలేషన్‌షిప్‌పై జరుగుతున్న ప్రచారంతో తాను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు బాలీవుడ్ యువ నటుడు మీజాన్ జాఫేరీ వాపోయారు. ఈ జంట గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బిగ్ బీ అమితాబ్ మనవరాలితో తన కుమారుడి ప్రేమ వ్యవహారంపై మీజాన్ తండ్రి ఇటీవల స్పందించారు. అందరూ అనుకుంటున్నట్టు వాళ్లిద్దరి మధ్య ఎలాంటి లవ్ ఎఫైర్ లేదన్నారు.
కేవలం స్నేహితులు మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నవ్యతో తన బంధంపై మీజాన్ వివరణ ఇచ్చారు. మీడియాతో మీజాన్ జాఫేరీ మాట్లాడుతూ ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“నవ్య నవేలీతో నా అనుబంధం గురించి నిజంగా, నిజాయితీగా చెప్తున్నా.. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే. కానీ మేమిద్దరం ప్రేమపక్షులమని ప్రచారం చేయడం అన్యాయం. ఆమె వ్యక్తిగత జీవితం వేరు. నవ్య నాకు మాత్రమే కాదు, నా సోదరికి కూడా బెస్ట్ ఫ్రెండ్. మరొకరి గురించి ఇలా ఇష్టమొచ్చినట్లుగా కథనాలు ప్రచారం చేయడం ఏమీ బాగోలేదు. దీనివల్ల నేను నా ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను.
గడప లోపలకు అడుగు పెట్టగానే మా పేరెంట్స్.. ఏంటిదంతా? అన్నట్లుగా ఓ చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అని ఓ నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి జారుకుంటున్నాను. అయినా నేను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్లో లేను” అని మీజాన్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా వాళ్లిద్దరిపై సాగుతున్న ప్రచారానికి తెరపడుతుందేమో చూడాలి.