ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన రైటర్

“గుడ్డ నీ బాబుది, చముర నీ బాబుది, కాబట్టి కాలేదీ నీ బాబుదే”.. ఆదిపురుష్ లో అత్యంత వివాదాస్పదమైన డైలాగ్ ఇది. స్వయంగా హనుమంతుడి పాత్రతో ఈ డైలాగ్ చెప్పించారు. ఇది రాసిన డైలాగ్…

“గుడ్డ నీ బాబుది, చముర నీ బాబుది, కాబట్టి కాలేదీ నీ బాబుదే”.. ఆదిపురుష్ లో అత్యంత వివాదాస్పదమైన డైలాగ్ ఇది. స్వయంగా హనుమంతుడి పాత్రతో ఈ డైలాగ్ చెప్పించారు. ఇది రాసిన డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్.

ఈ భయంకరమైన డైలాగ్ తో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ మనోజ్ వెనక్కు తగ్గలేదు. ఇప్పటి తరాన్ని రామాయణం వైపు ఎట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి మాస్ డైలాగ్స్ ఉండాల్సిందేనంటూ సమర్థించుకున్నాడు. అక్కడితో ఆగలేదు, చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలానే రామాయణం చెప్పిందంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

అయితే ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 'ప్రజల్ని పిచ్చోళ్లు అనుకుంటున్నారా' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మనోజ్ ను కూడా ఈ కేసులో భాగస్వామిని చేయాలని ఆదేశించింది.

దీంతో ఇన్నాళ్లూ తన వాదనల్ని సమర్థించుకుంటూ వచ్చిన మనోజ్, ఎట్టకేలకు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాడు. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందుకు చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నానంటూ పోస్ట్ పెట్టాడు.

“ఆదిపురుష్ సినిమా మూలంగా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయనే విషయాన్ని అంగీకరిస్తున్నాను. చేతులు జోడించి, అందర్నీ క్షమాపణలు కోరుతున్నాను. ప్రభువు భజరంగభళి మనందర్నీ ఐక్యంగా ఉంచుతాడని నమ్ముతున్నాను. సంస్కృతి సంప్రదాయాల్ని కొనసాగించేందుకు మనందరికీ శక్తిని ప్రసాదిస్తాడని ఆశిస్తున్నాను.”

మనోజ్ క్షమాపణలైతే కోరాడు కానీ, నెటిజన్ల ఆగ్రహం మాత్రం చల్లారలేదు. సినిమా రిలీజై, ఇంత గొడవ జరిగిన తర్వాత ఇన్ని రోజులకు మనోజ్ తప్పు తెలుసుకోవడం సిగ్గు చేటంటూ పోస్టులు పెడుతున్నారు. కోర్టు కేసు అవుతుందని భయపడి మనోజ్ ఇలా క్షమాపణలు చెప్పాడని, కోర్టులు తప్పుపట్టకపోతే అసలు అతడు ఈ సిగ్గుమాలిన పనిని పట్టించుకోడంటూ మరికొందరు చెబుతున్నారు.