శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టై 3 నెలలుగా జైలు జీవితం గడుపుతున్న హీరోయిన్ సంజనా గల్రానీకి ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇస్తున్నట్టు జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ ప్రకటించారు.
3 లక్షల పూచీకత్తు, ఇద్దరు సాక్షి సంతకాలు తీసుకొని బెయిల్ పై ఆమెను రిలీజ్ చేయొచ్చని తీర్పు ఇచ్చారు. బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత నెలలో రెండు సార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లేదా కోర్టులో తప్పనిసరిగా హాజరు వేయించుకోవాలని.. పోలీసులు ఎప్పుడు కోరినా విచారణకు సహకరించాలని కండిషన్స్ పెట్టారు.
దాదాపు 2 నెలలుగా నడుము నొప్పితో బాధపడుతోంది సంజన. ఇదే కారణాన్ని చూపుతూ ఆమె గతంలో ఓసారి బెయిల్ పిటిషన్ పెట్టారు. కానీ దాన్ని కోర్టు తిరస్కరించింది.
రెండోసారి మెడికల్ రిపోర్టులతో బెయిల్ పిటిషన్ పెట్టగా.. ఆమెను మరోసారి పూర్తిస్థాయిలో పరీక్షించాల్సిందిగా ఆదేశాలిస్తూ బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది కర్నాటక హైకోర్టు. అన్ని నివేదికలతో మూడోసారి బెయిల్ కు అప్లయ్ చేసిన సంజన, ఎట్టకేలకు ఈరోజు బెయిల్ దక్కించుకుంది.
శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సంజనాకు వ్యతిరేకంగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు బలమైన సాక్ష్యాధారాలు సేకరించారు. ఆమె స్వయంగా మాదకద్రవ్యాలు తీసుకోవడంతో పాటు.. కొన్ని హై-ప్రొఫైల్ పార్టీలకు వాటిని సరఫరా చేసిందని అధికారులు ఆరోపిస్తున్నారు.
ప్రాధమిక సాక్ష్యాధారాల ఆధారంగా సెప్టెంబర్ 8న సంజనాను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అప్పట్నుంచి పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉంటున్న సంజన.. ఎట్టకేలకు జైలు గోడలు దాటి రేపు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది.
ఇదే కేసును ఆధారంగా చేసుకొని ఆమెపై మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. అది కూడా విచారణ దశలో ఉంది.