సంక్రాంతి పోటీ తర్వాత ఆ స్థాయిలో శివరాత్రికి బాక్సాఫీస్ వార్ ఉంటుందని అంతా ఊహించారు. ఫిబ్రవరి 17న సమంత, ధనుష్, విశ్వక్ సేన్ సినిమాలు పోటీపడతాయని భావించారు. కానీ ఊహించని విధంగా ఈ పోటీ నుంచి 2 సినిమాలు తప్పుకున్నాయి. 3 సినిమాలు లాక్ అయ్యాయి
లెక్కప్రకారం 17న థియేటర్లలోకి రావాలి శాకుంతలం సినిమా. సమంత లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా ఆ తేదీకి రావడం లేదనే విషయం కొన్ని రోజుల కిందటే లీక్ అయింది. తాజాగా మేకర్స్ కూడా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మాత్రం తేల్చిచెప్పారు.
అటు దాస్ కా ధమ్కీ సినిమా కూడా వాయిదా పడింది. విశ్వక్ సేన్ నటించిన ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి కారణం సినిమా నుంచి రిలీజైన 2 సాంగ్స్ హిట్ అవ్వడమే. అలా అంచనాలు పెంచిన ఈ సినిమా వాయిదా పడింది. సీజీ వర్క్ పూర్తికాలేదని, కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.
ఇలా అంచనాలతో రావాల్సిన 2 సినిమాలు వాయిద పడ్డంతో.. ధనుష్ సినిమాకు లైన్ క్లియర్ అయింది. ధనుష్ నటించిన తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ 'సర్', 17న థియేటర్లలోకి వస్తోంది. సమంత, విశ్వక్ సినిమాలు తప్పుకోవడంతో 'సర్' సినిమాకు భారీ ఎత్తున థియేటర్లు దక్కనున్నాయి.
అయితే ఈ సినిమాతో పాటు గీతాఆర్ట్స్-2 బ్యానర్ నుంచి వినరో భాగ్యము విష్ణుకథ, సంతోష్ శోభన్ హీరోగా నటించిన శ్రీదేవి శోభన్ బాబు సినిమాలు కూడా రాబోతున్నాయి. వీటిలో ఏ సినిమా శివరాత్రికి క్లిక్ అవుతుందో చూడాలి.
మరోవైపు శాకుంతలం సినిమా మే నెల వరకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ధమ్కీ సినిమా మాత్రం మార్చి నెలలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తమ్మీద శివరాత్రికి రాబోయే సినిమాలపై దాదాపు ఓ క్లారిటీ వచ్చేసింది.