థ్రిల్లర్లు అంటే.. అవి భారమైన ఫీలింగ్స్ ను కలిగించేవి కానవసరం లేదు. సరదా సరదాగా సాగుతూ కూడా ప్రేక్షకుడిని ఉత్కంఠతో ఎంగేజ్ చేయవచ్చని నిరూపించే అరుదైన సినిమాల్లో ఒకటి 'ఇన్ సైడ్ మ్యాన్'. కేవలం ఎంటర్ టైన్ చేయడంతోనే కాదు.. మూవీ మేకింగ్ కు సంబంధించి కూడా ఇన్ సైడ్ మ్యాన్ ఒక లెసన్. ఏదైనా కల్ట్ క్లాసిక్ ను ఆరాధించే వాళ్లు దాని ఆధారంగా మరో సినిమాను రూపొందించగలరు అనేందుకు కూడా ఈ సినిమా ఒక రుజువు.
ఈ సినిమాకు స్ఫూర్తిగా నిలిచే కల్ట్ క్లాసిక్ పేరు 'డాగ్ డే ఆఫ్టర్ నూన్' కాగా ఆ సినిమాకు ఆరాధకుడు అయిన దర్శకుడు స్పైక్ లీ ఒరిజినల్ ఐడియాను కాస్త మార్చి 'ఇన్ సైడ్ మ్యాన్' ను రూపొందించాడు. పాత కథకు రకరకాల సొబగులు అద్దాడు. ఈ మేకప్ పాత కథను వికారంగా తయారు చేయలేదు, కొత్త రకంగా మార్చేసింది! ఇన్ సైడ్ మ్యాన్ రూపంలో డాగ్ డే ఆఫ్టర్ నూన్ మరోసారి ఆకట్టుకుంది!
ఇద్దరు ఎల్ బోర్డు దొంగలు ఒక బ్యాంకు దోపిడీకి పాల్పడే ప్రయత్నమే 'డాగ్ డే ఆఫ్టర్ నూన్' సినిమా కథ. విఖ్యాత నటుడు అల్ పాచినో ఆ సినిమాకు ప్రాణం పోశాడు. దశాబ్దాలుగా ఆ సినిమా హాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలుస్తోంది. డాగ్ డే ఆఫ్టర్ నూన్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అమాయకులు, ఆశపరులు అయిన ముగ్గురు కుర్రాళ్లు స్థానికంగా ఒక బ్యాంక్ దోపిడీకి ప్రయత్నిస్తారు. ఆయుధాలతో వెళ్లి బ్యాంకును అదుపులోకి తీసుకుంటారు.
ఆ ముగ్గురులో ఒకటి.. మొదట్లోనే భయమేసి బ్యాంకు నుంచి బయటకు వచ్చి పారిపోతాడు. లోపలే ఉండిపోయిన ఇద్దరు దొంగలకూ ఎవరినీ చంపే ఉద్దేశం ఉండదు. కేవలం తమకు డబ్బులు ఇవ్వాలని, పారిపోవడానికి ఒక విమానాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం మొదలుపెడతారు. ఆ దొంగతనం ఒక ప్రహసనంగా మారుతుంది. పోలీసులు రంగంలోకి దిగుతారు. బ్యాంకు ఉద్యోగులు దొంగలపై జాలి పడతారు. బయట మూగే జనం దొంగలకు మద్దతుదారులుగా నిలుస్తారు! పోలీసులు కూడా చివరకు వారి డిమాండ్ లకు తలొగ్గుతారు. చివర్లో ట్విస్ట్ ను ఇస్తూ.. ఆ అమాయకుల్లో ఒకడిని కాల్చి చంపి, ఇంకొకడిని అదుపులోకి తీసుకుంటారు. అమాయకుడైన దొంగ బలి కావడంతో అదొక ట్రాజెడీ క్లైమాక్స్ గా ముగుస్తుంది. అదీ డాగ్ డే ఆఫ్టర్ నూన్ కథ.
దశాబ్దాల నాటి ఆ సినిమాలోని ఆత్మను తీసుకుని.. దానికి మరో రూపాన్ని ఇచ్చాడు స్పైక్ లీ. తన జీవితంలో చేసిన ఒక పెద్ద బ్యాంకు దొంగతనం గురించి ఒక దొంగ చెప్పడంతో కథ మొదలవుతుంది. అది విజయవంతమైన దొంగతనం. న్యూయార్క్ లోని ఒక ప్రైవేట్ బ్యాంకు అది. దాని ఫౌండర్ ఒక ప్రముఖుడిగా అందరి మన్ననలూ పొందుతూ ఉంటాడు. ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టిన వ్యక్తిగా నిలుస్తుంటాడు. అలాంటి బ్యాంకులోకి కొందరు ముసుగు దొంగలు ప్రవేశిస్తారు.
చాలా స్ట్రాటజిక్ గా వారు అక్కడ సీసీ కెమెరాలు పని చేయకుండా చేస్తారు. బ్యాంకులో పని ఉన్న వారిలాగా ఒక్కొక్కరు లోపలకు వెళ్లి డోర్లు క్లోజ్ చేసి.. పూర్తిగా అదుపులోకి తీసుకుంటారు. అందరు బ్యాంకు దొంగల్లాగానే వీరు వ్యవహరిస్తారు. డబ్బులు తీయమంటారు, బ్యాగుల్లో సర్దమంటారు. ఇంతలోనే పోలీసులకు ఇన్ఫర్మేషన్, భారీ ఎత్తున వారు బయట రంగంలోకి దిగడం జరుగుతుంది.
బయట పోలీసుల హడావుడితో దొంగలు పారిపోలేని పరిస్థితుల్లో చిక్కుబడతారు. తమ ఆధీనంలో ఉన్న వారి ప్రాణాలను అడ్డం పెట్టుకుని పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తారు. ఒక పోలీసు ఉన్నతాధికారి కీత్ ఫ్రైజర్(డెంజిల్ వాషింగ్టన్) వారితో సంప్రదింపులు జరపడం మొదలుపెడతాడు. లోపలున్న వారందరికీ భోజనం ఏర్పాట్లు చేస్తారు. డిమాండ్లు ఏమిటని అడిగితే.. పారిపోవడానికి బస్సు, ఆపై విమానం ఏర్పాటు చేయాలంటారు. ఇంతలో బ్యాంకు చైర్మన్ కమ్ ఫౌండర్ గాబరా పడుతుంటాడు.
బ్యాంకు లాకర్లలో అతడికి సంబంధించిన కీలక రహస్యలుంటాయి. ఆ బ్యాంకు ఫౌండర్ జర్మనీ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి. అతడొక నాజీ. వేల మంది యూధుల ప్రాణాలను తీయడానికి సహకరించిన వ్యక్తి. నాజీలు ఇచ్చిన డబ్బుతో యుద్ధం ముగిశాకా అమెరికా పారిపోయి వచ్చి, ఫేక్ ఐడెంటీటీతో బ్యాంకు పెట్టి సక్సెస్ అయ్యి ఉంటాడు. అయినా నాజీలు గతంలో ఇచ్చిన మెడల్ ను, తన నాజీ ఐడెంటీటీని నాశనం చేయకుండా వాటిని తన సొంత బ్యాంకు లాకర్లో పెట్టి దాచుకుని ఉంటాడు. అవి దోపిడీ దార్లకు దొరికితే అంతే సంగతులనేది అతడి భయం. దీంతో తన తరఫున ఒక మహిళా ఇన్వెస్టిగేటర్ ను పోలీసులకు అటాచ్ చేస్తాడు.
మరోవైపు ఈ దోపిడీ దొంగలకు పూర్తిగా తలొగ్గే ఉద్దేశం లేని పోలీసులు వారు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి పిజ్జా బాక్సులకు రహస్య మైకులను పెడతాడు. వాటిల్లో వారు మాట్లాడుకునేది వింటూ ఉంటారు. వారు ఇంగ్లిష్ లో మాట్లాడుకోరు. అదేం భాషో తెలుసుకునే ప్రయత్నం కూడా కామెడీగా ఉంటుంది. తీరా అది అసలు వారు మాట్లాడుకుంటున్నది కాదని తెలుస్తుంది. పోలీసులను డైవర్ట్ చేయడానికి వారు అదేదో దేశ అధ్యక్షుడి ప్రసంగాన్ని ప్లే చేస్తూ.. మైక్ ద్వారా పోలీసులకు వినపడే ఏర్పాట్లు చేసి ఉంటారు.
దొంగల డిమాండ్లను తెలుసుకున్న పోలీసు అధికారి.. ఇదేం డాగ్ డే ఆఫ్టర్ నూన్ సినిమ కాదంటాడు! ఆ సినిమా ఎండింగ్ ఎలా ఉంటుందో తెలియదా అని ప్రశ్నిస్తాడు! విమానాలు తీసుకుని దేశాలు దాటడం అంటే మాటలు కాదని, అదంతా జరిగేది కాదని అంటాడు. తనే లోపలకు వెళ్లి అంతా ప్రాణాలతో ఉన్నారో లేదో చూస్తానంటాడు. అతి తెలివిని చూపబోయిన డిటెక్టివ్ కిడ్నాపర్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అర్థం చేసుకుని కామ్ గా బయటకు వచ్చేస్తాడు. అంతిమంగా రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాలని నిర్ణయిస్తాడు.
అప్పటికే లోపల కిడ్నాపర్లు ఎవరు కిడ్నాపర్లో, ఎవరు బ్యాంకుకు వచ్చి ఉన్న వాళ్లో తేలికగా అర్థం కాకుండా ఉండటానికి తగిన ఏర్పాట్లతో ఉంటారు. అందరికీ తమ యూనిఫామ్ లే ఇచ్చి ఉంటారు. పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో విరుచుకపడబోతున్నారన్న విషయం అర్థమయిన వెంటనే ఒక్కసారిగా బ్యాంకు తలుపులు తెరుచుకుంటాయి. లోపలి వారంతా ఒక్కసారిగా బయటకు వస్తారు. పొగ బాంబులతో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుంది.
లోపల నుంచి వచ్చిన వారందరినీ ఒక్కసారిగా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. వారందరినీ విచారణకు తీసుకెళ్తారు! లోపలకు వెళ్లి చూస్తూ ఇంకెవ్వరూ కనిపించరు. విచారణలో తేలేదేమిటంటే.. దొరికిన వారెవ్వరూ దొంగలు కాదు. వారంతా బ్యాంకుకు వివిధ పని మీద వెళ్లిన వారే. ఇంతకీ దొంగతనం యత్నం చేసిన వారు ఏమైనట్టు? అనేది పోలీసులకు అంతుబట్టని అంశం అవుతుంది.
వాస్తవానికి సినిమా స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటుంది. బయటకు వచ్చిన వారిని ఒక్కొక్కరినీ పిలిచి డేంజిల్ వాషింగ్టన్ విచారిస్తుండగా.. సినిమా సాగుతూ ఉంటుంది. వారిని ఆ డిటెక్టివ్ పాత్ర సరదాగా అనుమానించడం, మీరేనా ఆ దొంగల్లో ఒకరు అంటూ ప్రతి ఒక్కరినీ అనడం, వారు తాము కాదని నిరూపించుకుని బయటపడటంతో సినిమా ముందుకు సాగుతూ ఉంటుంది. బ్యాంకు నుంచి ఒక్క డాలర్ కూడా పోలేదు. తమ డబ్బులేవీ పోలేదని బ్యాంకు ప్రకటిస్తుంది.
బయటకు వచ్చిన వాళ్లంతా కస్టమర్లే అని తెలుతుంది. దీంతో ఆ కేసు ముగుస్తున్న దశలో.. ఒక రహస్య లాకర్ గురించి డిటెక్టివ్ కు సమాచారం అందుతుంది. అదే బ్యాంకు చైర్మన్ రహస్యంతో ముడిపడిన లాకర్. అందులో కొన్ని వజ్రాలతో పాటు నాజీ రహస్యం కూడా ఉంటుంది. ఆ నాజీ రహస్యాన్ని బయటపెట్టడం దొంగల ఉద్దేశం కాదని మొదట్లోనే స్పష్టత వస్తుంది. దాన్ని దాచి పెద్ద బిగ్ షాట్ ను బ్లాక్ మెయిల్ చేసేంత సీన్ తమకు లేదని వారు ఒప్పుకుంటారు.
అంతిమంగా.. వజ్రాలను వారు మాయం చేసి ఉంటారు. బయటకు వచ్చిన వారెవరితోనూ వజ్రాలు దొరకవు. వారు వాటిని ఎలా బయటకు తీసుకొచ్చారనేది చిన్న పాటి సస్పెన్స్. ఈ కేసు ఎటూ తేలక తనకు వస్తుందనుకున్న ప్రమోషన్ కూడా తేలకపోవడం, శాలరీ పెరగకపోవడంతో నిస్తేజంగా ఉన్న డిటెక్టివ్ కు ఆ వజ్రాల్లో ఒకదాన్ని అతడికే తెలియకుండా అతడికి అందజేసి దొంగలు.. అసలు కథ అంతా అతడికి అర్థమయ్యేలా చేసి, తమ కృతజ్ఞతను చాటుకోవడంతో సినిమా ముగుస్తుంది.
ముందుగా చెప్పినట్టుగా.. డాగ్ డే ఆఫ్టర్ నూన్ మూలకథను మరో రకంగా మార్చి చూపే వినోదాత్మక ప్రయత్నం 'ఇన్ సైడ్ మ్యాన్'. డాగ్ డే ఆఫ్టర్ నూన్ ట్రాజెడీ ఎండింగ్ తో కొంత నిరాశ పరుస్తుంది. ఆ సినిమాకు అదే ప్లస్ అదే మైనస్. ఇన్ సైడ్ మ్యాన్ మాత్రం ఆద్యంతం వినోదాత్మకమైన థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది.
జీవన్ రెడ్డి.బి